పీవోకేలో ఉద్రిక్తత.. బ్రిటిష్ పౌరుడి మృతి

నిరసనలపై కాల్పులు.. మరో బ్రిటిష్ వ్యక్తి అరెస్టు
రెండు నెలలుగా నిర్బంధంలో వకాస్ ఆరిఫ్
పాకిస్థాన్ అధికారులతో బ్రిటన్ సంప్రదింపులు
ప్రభావిత ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రయాణ హెచ్చరిక

, ఆగస్టు 11: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో కొనసాగుతున్న నిరసనలు అంతర్జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ఆర్థిక, ఎన్నికల సంస్కరణల కోసం నిర్వహించిన ఆందోళనల నేపథ్యంలో పాకిస్థాన్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఓ బ్రిటిష్ పౌరుడు ప్రాణాలు కోల్పోగా, మరో బ్రిటిష్ జాతీయుడిని అరెస్టు చేసి రెండు నెలలుగా నిర్బంధంలో ఉంచిన ఘటన వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ పరిణామాలపై బ్రిటన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ అధికారులతో సంప్రదింపులు ప్రారంభించింది. బ్రిటన్‌లోని పీటర్‌బరో నగరానికి చెందిన 50 ఏళ్ల మహ్మద్ అక్తర్ జూన్ 9న కోట్లి నగరంలో జరిగిన నిరసనల సమయంలో భద్రతా బలగాల కాల్పుల్లో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిరసనల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొనలేదని, ఇంటి సమీపంలో జరిగిన ఘటనలో తూటా గుండె పక్కన తగలడంతో ప్రాణాలు కోల్పోయారని బంధువులు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయడానికి కూడా కుటుంబ సభ్యులు భయపడుతున్నారని వారు పేర్కొన్నారు.మరోవైపు, నాటింగ్‌హామ్‌కు చెందిన 38 ఏళ్ల వకాస్ ఆరిఫ్‌ను జూన్ 5న మిర్‌పూర్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తన సోదరుడు నిరసనల్లో పాల్గొనకపోయినా ఇంట్లోకి చొరబడి అరెస్టు చేశారని, ఇప్పటివరకు కోర్టులో కూడా హాజరుపరచలేదని ఆయన సోదరి సుమేరా ఆరోపించారు. ఈ ఘటన మానవ హక్కుల ఉల్లంఘనలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ రెండు ఘటనలపై బ్రిటన్ విదేశాంగ కార్యాలయం స్పందిస్తూ ఇస్లామాబాద్‌లోని అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. మరణించిన వ్యక్తి ఘటనపై పూర్తి నివేదిక కోరడంతో పాటు, నిర్బంధంలో ఉన్న వకాస్ ఆరిఫ్ పరిస్థితిపై వివరాలు తెలుసుకుంటున్నట్లు తెలిపింది. పౌరుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది.
పీవోకేలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో ఆగస్టు 7న బ్రిటన్ ప్రభుత్వం తన ప్రయాణ సూచనలను సవరించింది. నిరసనల ప్రభావం ఉన్న ప్రాంతాలకు వెళ్లవద్దని తమ పౌరులను హెచ్చరించింది. భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయని పేర్కొంటూ అత్యవసరమైతే తప్ప ఆ ప్రాంతాలకు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. పీవోకేలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు నిరసనకారులపై బలప్రయోగం, మరోవైపు విదేశీ పౌరుల మృతి, అరెస్టుల ఘటనలు పాకిస్థాన్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ వ్యవహారంపై బ్రిటన్ చేపట్టే తదుపరి చర్యలు, పాకిస్థాన్ స్పందనపై ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది.

error: Content is protected !!
Prajaveek Shanam