రాహుల్‌కు సుప్రీంకోర్టులో ఊరట

హైకోర్టు విచారణకు తాత్కాలిక నిలుపుదల
సీబీఐ, ఈడీ నివేదికలపై ఆంక్షలు
రాహుల్‌కు అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్న
దర్యాప్తు సంస్థల పాత్రపై ధర్మాసనం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఆగస్టు 17 (ప్రజా వీక్షణం ):

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టులో తదుపరి విచారణ చేపట్టవద్దని స్పష్టం చేస్తూ, సీబీఐ, ఈడీ ఎలాంటి నివేదికలను హైకోర్టుకు సమర్పించవద్దని ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్యా బాగ్చీ, వీ. మోహన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ రాహుల్ గాంధీపై దాఖలైన పిటిషన్ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలను పరిశీలించిన ధర్మాసనం, ఈ దశలో హైకోర్టు విచారణ కొనసాగించడం సముచితం కాదని భావించి తాత్కాలికంగా నిలిపివేసింది.విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు హైకోర్టు విధానంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఒక వ్యక్తికి సంబంధించిన కేసులో అతనికి తన వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా ఎలా ఆదేశాలు జారీ చేశారని ప్రశ్నించింది. రాహుల్ గాంధీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు నిర్ణయం తీసుకోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కనిపిస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. కేసు దాఖలు చేసిన కర్ణాటకకు చెందిన ఎస్. విఘ్నేశ్ సిసిర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు హైకోర్టులో ఎలాంటి పురోగతి ఉండకూడదని స్పష్టం చేసింది. దీంతో ఈ కేసులో రాహుల్ గాంధీకి తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది.
దర్యాప్తు సంస్థల వ్యవహారశైలిపైనా సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది. ఆదాయానికి మించిన ఆస్తులపై విశ్వసనీయ సమాచారం అందితే సంబంధిత సంస్థలు స్వయంగా దర్యాప్తు చేపట్టవచ్చని, దాని కోసం తప్పనిసరిగా కోర్టు ఆదేశాలు అవసరమా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ, ఈడీ వంటి సంస్థలు స్వతంత్రంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా పేర్కొంది. సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజును ఉద్దేశించి న్యాయమూర్తి జోయ్‌మాల్యా బాగ్చీ కీలక వ్యాఖ్యలు చేశారు. విషయం అంత తీవ్రమైనదైతే దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని, కోర్టు ఆదేశాల కోసం ఎందుకు ఎదురుచూశాయని ప్రశ్నించారు. స్వయంచాలకంగా ఏవైనా చర్యలు చేపట్టారా అని కూడా నిలదీశారు.ఈ నేపథ్యంలో కేసు న్యాయపరంగా కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు జోక్యంతో ప్రస్తుతం హైకోర్టు ప్రక్రియ నిలిచిపోయింది. తదుపరి విచారణలో ధర్మాసనం తీసుకునే నిర్ణయం రాజకీయంగా, న్యాయపరంగా ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం మాత్రం సుప్రీంకోర్టు ఆదేశాలతో రాహుల్ గాంధీకి గణనీయమైన ఊరట లభించింది.

error: Content is protected !!
Prajaveek Shanam