భారత-ఆస్ట్రియా ఎన్నికల సహకార చర్చలు

జ్ఞానేశ్ కుమార్ నేతృత్వంలో భేటీ
ఆస్ట్రియా రాయబారితో కీలక సమావేశం
ఎన్నికల నిర్వహణపై సహకారం విస్తరణ
సిబ్బంది శిక్షణకు ఉమ్మడి కార్యాచరణ

న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ప్రజా వీక్షణం ): భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, అంతర్జాతీయ ప్రజాస్వామ్య, ఎన్నికల సహాయ సంస్థ సభ్య దేశాల మండలి అధ్యక్షుడు జ్ఞానేశ్ కుమార్ బుధవారం భారత్‌లోని ఆస్ట్రియా రాయబారి డాక్టర్ రాబర్ట్ జిష్‌తో నిర్వచన్ సదన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతం, ఎన్నికల నిర్వహణలో పరస్పర సహకారం, ఎన్నికల సిబ్బంది శిక్షణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రెండు దేశాలు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు తమ కట్టుబాటును మరోసారి పునరుద్ఘాటించాయి. అంతర్జాతీయ ప్రజాస్వామ్య, ఎన్నికల నిర్వహణ సదస్సు–2026లో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయి. ప్రజాస్వామ్య సంస్థల సామర్థ్య పెంపు కోసం పరస్పర అనుభవాలను పంచుకోవడం అవసరమని పేర్కొన్నాయి.
ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పారదర్శకత, సమర్థత పెంపు వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియను మరింత విశ్వసనీయంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడంలో పరస్పర సహకారానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్నికల సిబ్బంది శిక్షణ కార్యక్రమాల విషయంలో కూడా రెండు దేశాలు కలిసి పనిచేయడానికి అంగీకరించాయి. ఆధునిక ఎన్నికల నిర్వహణ పద్ధతులు, సాంకేతిక నైపుణ్యాలు, శిక్షణా కార్యక్రమాల రూపకల్పనలో పరస్పర సహకారం పెంచాలని నిర్ణయించారు. ఎన్నికల వ్యవస్థల్లో ఉత్తమ విధానాలను ఒకరికొకరు పంచుకోవడం ద్వారా సామర్థ్యాన్ని పెంచుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ స్థాయిలో భారత ఎన్నికల వ్యవస్థకు లభిస్తున్న గుర్తింపు నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య మరియు ఎన్నికల సహాయ సంస్థలో భారత్ కీలక పాత్ర పోషిస్తుండగా, వివిధ దేశాలతో ఎన్నికల రంగంలో సహకారాన్ని విస్తరిస్తోంది. భారత్, ఆస్ట్రియా మధ్య జరిగిన ఈ చర్చలు భవిష్యత్తులో ఎన్నికల నిర్వహణ, శిక్షణ, ప్రజాస్వామ్య సంస్థల బలోపేతానికి కొత్త అవకాశాలను తెరవనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల పారదర్శకత, సిబ్బంది సామర్థ్య పెంపు వంటి అంశాల్లో ఉమ్మడి కార్యాచరణకు ఈ సమావేశం బాటలు వేసిందని పేర్కొంటున్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam