శ్రీనగర్‌లో అమెరికా రాయబారి పర్యటన

ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో భేటీ
పర్యాటక అవకాశాలపై సానుకూల వ్యాఖ్యలు
ట్రావెల్ అడ్వైజరీ సడలింపుపై సూచన

శ్రీనగర్, ఆగస్టు 19 (ప్రజా వీక్షణం ): జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఈ ప్రాంతాన్ని సందర్శించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న తొలి అమెరికా రాయబారిగా ఆయన గుర్తింపు పొందారు. బుధవారం శ్రీనగర్‌లో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో ఆయన సమావేశమయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సెర్గియో గోర్, జమ్మూకశ్మీర్ భారతదేశంలో అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతాల్లో ఒకటిగా అభివర్ణించారు. తాను తొలిసారిగా ఇక్కడికి వచ్చినప్పటికీ ఈ ప్రాంతం అందాలు, ప్రకృతి వైభవం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు. పర్యాటక రంగానికి అపార అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయని పేర్కొన్న ఆయన, అమెరికా పౌరుల కోసం అమలులో ఉన్న ప్రయాణ హెచ్చరికలను సడలించే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. అనేక మంది అమెరికన్లు జమ్మూకశ్మీర్‌ను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారని, భవిష్యత్తులో విదేశీ పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పర్యటనలో భాగంగా అమెరికా రాయబారి సెర్గియో గోర్ జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా సమావేశం కానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అభివృద్ధి, పర్యాటక అవకాశాలు వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆయన లద్దాఖ్ ప్రాంతంలో పర్యటించనున్నారు.
ఇక కశ్మీర్‌కు సంబంధించిన అంశాలు పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారాలేనని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పునరుద్ఘాటించారు. ఈ సమస్యల పరిష్కారం ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని, ఇందులో విదేశీ జోక్యానికి అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా రాయబారితో సమావేశంలో కూడా ఈ అంశాన్ని చర్చించబోనని ముందుగానే వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు, పర్యాటక రంగ పునరుజ్జీవనం అంతర్జాతీయ వర్గాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా రాయబారి పర్యటన ప్రాధాన్యత సంతరించుకోగా, భద్రతా పరిస్థితులపై ఆయన చేసిన సానుకూల వ్యాఖ్యలు రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఊతమివ్వనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam