నీట్ సంస్కరణలపై సుప్రీం దృష్టి

ఎన్‌టీఏకు పూర్తి వివరాల సమర్పణ ఆదేశం
వ్యవస్థాగత మార్పులు శాశ్వతంగా అమలు కావాలన్న ధర్మాసనం
ప్రశ్నపత్రాల భద్రతపై కేంద్రం వివరణ
పేపర్ లీక్‌ల పునరావృతంపై ఆందోళన

న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ప్రజా వీక్షణం ): నీట్‌ పరీక్షల నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై సుప్రీంకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల విధానంలో సంస్కరణలు కేవలం నివేదికలు, సిఫార్సులకే పరిమితం కాకుండా శాశ్వత వ్యవస్థగా అమలు కావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. రాధాకృష్ణన్ కమిటీ, నందన్ నీలేకని కమిటీలు సూచించిన సంస్కరణల అమలుపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల పూర్తి వివరాలను సమర్పించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను ఆదేశించింది. నీట్-యూజీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాధేలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ తరఫున దాఖలైన పిటిషన్‌ను కూడా కోర్టు పరిశీలించింది. పరీక్షల నిర్వహణలో వ్యవస్థాగత మార్పులు అవసరమని, ఒకసారి సంస్కరణలు ప్రకటించడం సరిపోదని, వాటి అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని ధర్మాసనం పేర్కొంది.
విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. నీట్ ప్రశ్నపత్రం తయారీ నుంచి విద్యార్థుల చేతికి చేరే వరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ అమల్లో ఉందని ఆయన కోర్టుకు వివరించారు. ప్రశ్నపత్రం రూపకల్పనలో అనేక స్థాయిల్లో గోప్యత పాటిస్తున్నామని, ప్రశ్నల ఎంపిక ప్రక్రియను అత్యంత రహస్యంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రశ్నపత్రాల రవాణాలో కూడా ప్రత్యేక భద్రతా చర్యలు అమలు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రశ్నపత్రాలను తరలించే వాహనాలకు జీపీఎస్ పరికరాలు అమర్చినట్లు, వాహనం కదలికలన్నీ నిరంతరం పర్యవేక్షణలో ఉంటాయని కోర్టుకు తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న భద్రతా వ్యవస్థను ఛేదించడం చాలా కష్టమని కేంద్రం పేర్కొంది.
నీట్ పేపర్ లీక్ ఘటనల అనంతరం కేంద్ర విద్యాశాఖ ఏడుగురు సభ్యులతో రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసింది. పరీక్షల నిర్వహణ, డేటా భద్రత, ఎన్‌టీఏ నిర్మాణం, విధి నిర్వహణలో సంస్కరణలపై ఈ కమిటీ పలు కీలక సిఫార్సులు చేసింది. అదే సమయంలో మరింత విస్తృత స్థాయి మార్పుల కోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో మరో ఉన్నతస్థాయి టాస్క్‌ఫోర్స్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. విచారణ అనంతరం పిటిషనర్ల తరఫు న్యాయవాది తన్వీ దూబే స్పందిస్తూ, రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులు ఉన్నప్పటికీ గతంలో చోటుచేసుకున్న లోపాలు ఎందుకు పునరావృతమయ్యాయనే అంశంపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కిచెప్పిందని తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam