భారత్‌–పాక్‌ హాకీ పోరు

న్యూఢిల్లీ, ఆగస్టు 19 (ప్రజా వీక్షణం ) : క్రీడ ఏదైనా భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య పోరు అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. అలాంటి దాయాదుల సమరం మరోసారి జరగనుంది. ప్రపంచ హాకీ కప్‌లో భాగంగా బుధవారం భారత్‌, పాకిస్థాన్‌ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య కరచాలనం అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
కరచాలనానికి దూరంగా భారత ఆటగాళ్లు
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందంటూ పాకిస్థాన్‌ తీరుపై భారత్‌ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రీడా సంబంధాలు నిలిచిపోయాయి. అంతర్జాతీయ పోటీల్లో మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ ఆటగాళ్లతో కరచాలనం చేసేందుకు భారత క్రీడాకారులు నిరాకరిస్తున్నారు. క్రికెట్‌లో అనుసరిస్తున్న ఈ విధానాన్నే హాకీలోనూ కొనసాగించాలని భారత ఆటగాళ్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమకు కరచాలనం కంటే మ్యాచ్‌లో విజయం సాధించడమే ముఖ్యమని వారు స్పష్టం చేస్తున్నారు.పాకిస్థాన్‌కు గెలుపు తప్పనిసరి
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు గెలుపు అత్యవసరం. భారత్‌ మాత్రం గెలవకపోయినా కనీసం డ్రాతో తదుపరి దశకు చేరుకునే అవకాశం ఉంది. భారత్‌ తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై విజయం సాధించగా, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, భారత్‌ మూడు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. వేల్స్‌, పాకిస్థాన్‌ చెరో పాయింట్‌తో ఉన్నాయి. పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి.

error: Content is protected !!
Prajaveek Shanam