మెస్సీ జెర్సీకి భారీ ధర

లండన్, ఆగస్టు 21 (ప్రజా వీక్షణం ): ఫుట్‌బాల్‌ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్‌ లియోనల్‌ మెస్సీ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ స్టార్‌ ఫుట్‌బాలర్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మెస్సీ ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్‌ ఆడినా అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియాలకు తరలివస్తారు. తాజాగా మెస్సీ ధరించిన ఓ జెర్సీ వేలంలో భారీ ధరకు అమ్ముడై మరోసారి ఆయన క్రేజ్‌ను చాటింది.
రూ.56.4 లక్షలకు మెస్సీ జెర్సీ
మాంచెస్టర్‌ యునైటెడ్‌ మాజీ థెరపిస్ట్‌ రాడ్‌ థార్న్‌లే వద్ద భద్రపరిచిన ఫుట్‌బాల్‌ వస్తువులకు వేలంలో అద్భుతమైన స్పందన లభించింది. బార్సిలోనా తరఫున ఆడిన సమయంలో లియోనల్‌ మెస్సీ ధరించిన ఓ జెర్సీ ఏకంగా 66,107 డాలర్లకు.. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.56.4 లక్షలకు అమ్ముడైంది.
రొనాల్డో జెర్సీకి రూ.9 లక్షలు
ఇదే వేలంలో క్రిస్టియానో రొనాల్డో ధరించిన రియల్‌ మాడ్రిడ్‌ జెర్సీ 10,601 డాలర్లకు.. అంటే సుమారు రూ.9.05 లక్షలకు విక్రయమైంది. మెస్సీ జెర్సీతో పోలిస్తే రొనాల్డో జెర్సీకి వచ్చిన ధర గణనీయంగా తక్కువగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
2012లో మెస్సీ ఇచ్చిన జ్ఞాపకం
మెస్సీ జెర్సీ వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. 2012లో బార్సిలోనా, మాంచెస్టర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా రాడ్‌ థార్న్‌లే.. బార్సిలోనా డిఫెండర్‌ గెరార్డ్‌ పిక్వెను కలిసి మెస్సీ జెర్సీని ఇవ్వాలని కోరాడు. మ్యాచ్‌ అనంతరం పిక్వె అతడిని బార్సిలోనా డ్రెస్సింగ్‌ రూమ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మెస్సీ తన జెర్సీని తీసి, దానిపై సంతకం చేసి థార్న్‌లేకు బహుమతిగా ఇచ్చాడు. ఈ అరుదైన జ్ఞాపకమే తాజాగా వేలంలో భారీ ధర పలికిన జెర్సీగా నిలిచింది.

error: Content is protected !!
Prajaveek Shanam