కర్ణ్‌ శర్మ క్రికెట్‌కు వీడ్కోలు

న్యూఢిల్లీ ఆగస్టు 23 (ప్రజా వీక్షణం ): టీమిండియా లెగ్‌స్పిన్నర్‌ కర్ణ్‌ శర్మ అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 38 ఏళ్ల కర్ణ్‌ శర్మ యూపీ టీ20 లీగ్‌లో కాన్పూర్‌ సూపర్‌స్టార్స్‌, మీరట్‌ మావెరిక్స్‌ మ్యాచ్‌ అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆగస్టు 25న లఖ్‌నవూ లెగ్‌ జట్టు ఆడే చివరి మ్యాచ్‌తో ఆటగాడిగా తన కెరీర్‌ను పూర్తిగా ముగించనున్నాడు.
దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌
2007-08 దేశవాళీ సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌-ఎ, టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేసిన కర్ణ్‌.. తొలినాళ్లలో ఆల్‌రౌండర్‌గా రాణించాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. 2012-13 సీజన్‌లో మూడు రంజీ మ్యాచ్‌ల్లో 21 వికెట్లు పడగొట్టి బీసీసీఐ ఉత్తమ అండర్‌-25 క్రికెటర్‌ అవార్డును అందుకున్నాడు.
ఐపీఎల్‌లోనూ ప్రత్యేక గుర్తింపు
2014 ఐపీఎల్‌ వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కర్ణ్‌ శర్మను రూ.3.75 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్డ్‌ భారత ఆటగాడిగా నిలిచాడు. అనంతరం పలు ఐపీఎల్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అతడి చివరి ఐపీఎల్‌ మ్యాచ్‌ 2025లో ముంబై ఇండియన్స్‌ తరఫున జరిగింది.
టీమిండియా తరఫున 3 ఫార్మాట్లలో
2014లో ఇంగ్లండ్‌ పర్యటనలో టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కర్ణ్‌.. తన తొలి మ్యాచ్‌లో జో రూట్‌ను ఔట్‌ చేశాడు. అదే ఏడాది శ్రీలంకపై వన్డే అరంగేట్రం చేశాడు. అనంతరం ఆస్ట్రేలియాతో అడిలైడ్‌లో టెస్టు అరంగేట్రం చేసి రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అదే అతడి ఏకైక టెస్టుగా మిగిలిపోయింది.
రిటైర్మెంట్‌పై కర్ణ్‌ శర్మ మాట్లాడుతూ.. తన ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, బీసీసీఐ, రైల్వేస్‌, యూపీసీఏ, ఆంధ్ర, విదర్భ క్రికెట్‌ సంఘాలకు కృతజ్ఞతలు తెలిపాడు. ఇకపై క్రికెట్‌కు సంబంధించిన కోచింగ్‌, ఇతర బాధ్యతలకు అందుబాటులో ఉంటానని వెల్లడించాడు.

error: Content is protected !!
Prajaveek Shanam