- జెనెసిస్ ఈఐఆర్ మూడో విడత ప్రారంభం
- యువ పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు
- దరఖాస్తుల స్వీకరణకు కేంద్రం పిలుపు

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మీటీ స్టార్టప్ హబ్ దేశవ్యాప్తంగా సాంకేతిక ఆధారిత ఆవిష్కరణలకు ఊతమిచ్చే ‘జెనెసిస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఇన్ రెసిడెన్స్’ మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించింది. వినూత్న ఆలోచనలను విజయవంతమైన వ్యాపారాలుగా మార్చేందుకు ఈ కార్యక్రమం వేదికగా నిలవనుంది. యువతలో ఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించి సాంకేతిక రంగంలో కొత్త సంస్థల ఆవిర్భావానికి తోడ్పడటమే దీని ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు. ఈ జాతీయ స్థాయి కార్యక్రమం ద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే యువకులు, పరిశోధకులు, విద్యార్థులు, ఆవిష్కర్తలు, ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్ వ్యవస్థాపకులకు సహాయం అందించనున్నారు. వినూత్న ఆలోచనలను మార్కెట్‌కు అనువైన ఉత్పత్తులు, సేవలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన మార్గదర్శకత్వం, సాంకేతిక సహకారం, నిపుణుల సలహాలు కల్పించబడతాయి.
తమ ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావాలనుకునే అభ్యర్థులకు ఈ కార్యక్రమం కీలక అవకాశంగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు, డిజిటల్ సాంకేతికతలు, ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్, పరిశోధన ఆధారిత రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు ఈ వేదిక ప్రోత్సాహం అందించనుంది. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన ‘జెనెసిస్ నెక్స్ట్‌జెన్ స్టార్టప్ సమ్మిట్’ సందర్భంగా జెనెసిస్ ఈఐఆర్ 3.0 కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా స్టార్టప్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.
ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన అభ్యర్థులు తమ ప్రతిపాదనలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సాంకేతికత ఆధారంగా కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించాలనుకునే యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్టార్టప్‌ల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు దేశ సాంకేతిక సామర్థ్యం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.












