విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ హెచ్చరిక

  • సెప్టెంబర్ 15లోపు అమెరికాకు చేరాలని సూచన
  • వీసా నిబంధనల్లో కీలక మార్పులకు రంగం
  • నాలుగేళ్ల కాలపరిమితి విధానంపై ఆందోళన
  • కోర్సు అనంతర గడువులోనూ మార్పులు

వాషింగ్టన్, ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి): అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అంతర్జాతీయ విద్యార్థులకు ప్రముఖ హార్వర్డ్ విశ్వవిద్యాలయం కీలక హెచ్చరిక జారీ చేసింది. అమెరికా జాతీయ భద్రతా శాఖ ఎఫ్-1, జే-1 వీసా నిబంధనల్లో తీసుకురానున్న మార్పుల నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో ఉన్న విద్యార్థులు, పరిశోధకులు సెప్టెంబర్ 15లోపు తిరిగి అమెరికాకు చేరుకోవాలని సూచించింది. కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత తిరిగి ప్రవేశించే వారికి తాజా నియమాలు వర్తించే అవకాశం ఉండటంతో ఈ సూచనలు చేసినట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థులు తమ విద్యా కార్యక్రమం పూర్తయ్యే వరకు అమెరికాలో ఉండేందుకు అనుమతించే “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానం అమల్లో ఉంది. ఈ విధానం కారణంగా కోర్సు పూర్తయ్యే వరకు ప్రత్యేక కాలపరిమితి లేకుండా విద్యార్థులు దేశంలో ఉండగలుగుతున్నారు. అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈ విధానాన్ని రద్దు చేసి, నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కొత్త వ్యవస్థను అమలు చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది.కొత్త విధానంలో విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే అనుమతి ఇవ్వడం లేదా వారు అభ్యసిస్తున్న కోర్సు వ్యవధికి అనుగుణంగా ముందుగానే ముగింపు తేదీని నిర్ణయించడం జరుగుతుంది. దీంతో దీర్ఘకాలిక పరిశోధన కార్యక్రమాలు, డాక్టరేట్ కోర్సులు లేదా ప్రత్యేక విద్యా ప్రణాళికల్లో ఉన్న విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉందని విద్యా వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా అనుకోని కారణాలతో కోర్సు ఆలస్యం అయితే అదనపు అనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే అమెరికాలో ఉండి విద్యను కొనసాగిస్తున్న విద్యార్థులకు కొంతవరకు మినహాయింపులు లభించే అవకాశమున్నప్పటికీ, సెప్టెంబర్ 15 తర్వాత విదేశాలకు వెళ్లి తిరిగి ప్రవేశించే వారిపై కొత్త నిబంధనలు పూర్తిగా అమలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకునే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని హార్వర్డ్ యాజమాన్యం సూచించింది. ముఖ్యంగా సెలవులు, పరిశోధన కార్యక్రమాలు లేదా కుటుంబ కారణాలతో విదేశాల్లో ఉన్నవారు నిర్ణీత తేదీలోపు తిరిగి చేరుకోవాలని స్పష్టం చేసింది.
నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండాల్సిన అవసరం ఉన్న విద్యార్థులు ప్రత్యేకంగా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో అదనపు పత్రాలు, విద్యా వివరాలు, పరిశోధన అవసరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించాల్సి వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థులు అమెరికా విడిచివెళ్లేందుకు ప్రస్తుతం ఉన్న గడువులో కూడా మార్పులు తీసుకురానున్నారు. కొత్త నిబంధనల ప్రకారం ఆ గడువు తగ్గే అవకాశం ఉండటంతో ఉద్యోగ అవకాశాలు వెతికే లేదా తదుపరి విద్యా ప్రణాళికలు రూపొందించే విద్యార్థులపై ప్రభావం పడవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుతున్న వేలాది మంది విదేశీ విద్యార్థులు తాజా పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam