
న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా డ్రైవర్ల ఖాతాలను నిలిపివేసిన ఆరోపణలపై ఉబర్‌కు భారీ జరిమానా పడింది. నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఉబర్‌పై 825 మిలియన్ యూరోల జరిమానా విధించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.9,245 కోట్లకు సమానం. యూరప్ జీడీపీఆర్ నిబంధనల కింద ఇప్పటివరకు విధించిన రెండో అతిపెద్ద జరిమానాగా ఇది నిలిచింది.
డ్రైవర్లకు తగిన సమాచారం ఇవ్వకుండానే వారి ఖాతాలను డీయాక్టివేట్ చేసినట్లు నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ ఆరోపించింది. ముఖ్యంగా కస్టమర్ల నుంచి తక్కువ రేటింగ్‌లు రావడం వంటి అంశాల ఆధారంగా కంప్యూటర్ ఆధారిత వ్యవస్థలు కొందరు డ్రైవర్ల ఖాతాలను శాశ్వతంగా నిలిపివేసినట్లు తెలిపింది. ఈ నిర్ణయాల్లో అర్థవంతమైన మానవ పర్యవేక్షణ లేదని నియంత్రణ సంస్థ పేర్కొంది.
ఉద్యోగం, ఆదాయం వంటి అంశాలపై గణనీయమైన ప్రభావం చూపే నిర్ణయాలను పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థల ఆధారంగా తీసుకోకూడదని డచ్ డేటా ప్రొటెక్షన్ అథారిటీ డిప్యూటీ ఛైర్ మోనిక్ వెర్డియర్ తెలిపారు. జీడీపీఆర్ నిబంధనల ప్రకారం ఇలాంటి నిర్ణయాల్లో మానవ పరిశీలనతో పాటు.. నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం కూడా ఉండాలని స్పష్టం చేశారు.
అయితే నియంత్రణ సంస్థ ఆరోపణలను ఉబర్ ఖండించింది. ఆటోమేటెడ్ వ్యవస్థ ఆధారంగా మాత్రమే డ్రైవర్లను శాశ్వతంగా డీయాక్టివేట్ చేయలేదని పేర్కొంది. చాలా సస్పెన్షన్లు తాత్కాలికమైనవేనని, శాశ్వత తొలగింపులకు మానవ పరిశీలన ఉంటుందని తెలిపింది. నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం డ్రైవర్లకు కల్పిస్తున్నామని పేర్కొంటూ.. జరిమానాపై అప్పీల్ చేయనున్నట్లు ఉబర్ వెల్లడించింది.
ఫ్రాన్స్‌లోని ఉబర్ డ్రైవర్ల ఫిర్యాదులతో ఈ వ్యవహారం మొదలైంది. మాజీ డ్రైవర్ బ్రహీమ్ బెన్ అలీ 2019లో తన ఖాతాను డీయాక్టివేట్ చేశారని ఆరోపించారు. అనంతరం సుమారు 170 మంది డ్రైవర్ల వాంగ్మూలాలను సేకరించి నెదర్లాండ్స్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన నియంత్రణ సంస్థ తాజాగా భారీ జరిమానా విధించింది.












