రూ.200 లక్షల కోట్లకు ఎస్‌బీఐ వ్యాపారం!

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (ప్రజా వీక్షణం ప్రతినిధి): దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) భవిష్యత్‌ వృద్ధిపై భారీ అంచనాలతో ఉంది. 2030 జూలై 1న ప్లాటినం జూబ్లీ (75వ వార్షికోత్సవం) జరుపుకునే నాటికి బ్యాంకు వ్యాపారం ప్రస్తుత స్థాయి నుంచి దాదాపు రెట్టింపై రూ.200 లక్షల కోట్లకు చేరుకోవచ్చని ఎస్‌బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. ఇది ప్రత్యేకంగా నిర్దేశించుకున్న లక్ష్యం కాదని, ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాపార వృద్ధి రేటు ఆధారంగా చేసిన అంచనా మాత్రమేనని స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికం నాటికి ఎస్‌బీఐ మొత్తం వ్యాపారం రూ.110.01 లక్షల కోట్లకు చేరింది.
ఎస్‌బీఐ వ్యాపార వృద్ధి దేశ ఆర్థికాభివృద్ధితో ముడిపడి ఉందని శెట్టి పేర్కొన్నారు. దేశ జీడీపీ ఏటా 7 నుంచి 8 శాతం మేర వృద్ధి చెందితే.. బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్‌ 11 నుంచి 12 శాతం మేర పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ లెక్కన సుమారు ప్రతి ఆరేళ్లకు బ్యాంకు బ్యాలెన్స్‌ షీట్‌ రెట్టింపు అవుతుందని తెలిపారు. ప్రస్తుత వృద్ధి ధోరణి కొనసాగితే 2030 నాటికి రూ.200 లక్షల కోట్ల వ్యాపారాన్ని చేరుకోవడం సాధ్యమేనని చెప్పారు.
‘విజన్‌ 2030’లో భాగంగా ఖాతాదారులు, ఉద్యోగులు, వాటాదారులు, ప్రభుత్వం-రెగ్యులేటర్ల అవసరాలపై ఎస్‌బీఐ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. ఖాతాదారులకు మెరుగైన సేవల అనుభూతిని అందించడం, ఉద్యోగుల విధి నిర్వహణను మరింత సులభతరం చేయడం ద్వారా ఉత్పాదకత పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు శెట్టి తెలిపారు. సామర్థ్యం, ఉత్పాదకతను పెంచి వాటాదారులకు మరింత విలువను అందించడంతో పాటు.. దేశంలో అత్యున్నత బ్యాంకుగా ప్రభుత్వానికి అవసరమైన సేవలను కొనసాగిస్తామని చెప్పారు. దేశంలోని మొత్తం పొదుపుల్లో దాదాపు నాలుగో వంతును ఎస్‌బీఐ సమీకరిస్తోందని, వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈలు, గ్రామీణ రంగాలకు రుణాల ద్వారా ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తున్నామని వివరించారు.

error: Content is protected !!
Prajaveek Shanam