
న్యూఢిల్లీ, ఆగస్టు 25 (ప్రజా వీక్షణం ప్రతినిధి): మాజీ క్రికెటర్ల కుమారులు సైతం వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ క్రికెట్‌లో సత్తా చాటుతున్నారు. మాజీ భారత ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా తన తండ్రి తరహాలో దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో ఆర్యవీర్ ఆడిన ఓ షాట్.. వీరేంద్ర సెహ్వాగ్‌ను గుర్తు చేసింది.
తండ్రిని గుర్తు చేసిన షాట్లు
వెస్ట్ ఢిల్లీ లయన్స్ తరఫున ఆడుతున్న ఆర్యవీర్.. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా స్క్వేర్ డ్రైవ్, కవర్ డ్రైవ్‌లతో తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్‌ను గుర్తు చేశాడు. 233 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్ట్ ఢిల్లీ లయన్స్ 21 పరుగుల తేడాతో ఓడిపోయినా.. ఆర్యవీర్ ఆట మాత్రం అభిమానులను ఆకట్టుకుంది.
దూకుడైన ఆటే ప్రత్యేకత
వీరేంద్ర సెహ్వాగ్ తన కెరీర్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. బౌలర్లపై ఏమాత్రం భయం లేకుండా ఎదురుదాడికి దిగే వీరూ.. ఇప్పుడు అదే తరహా బ్యాటింగ్ శైలిని తన కుమారుడు ఆర్యవీర్‌లో చూపిస్తున్నాడు.
సెహ్వాగ్ ఘనమైన రికార్డులు
1999లో పాకిస్థాన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సెహ్వాగ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 374 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో భారత తరఫున తొలి త్రిశతకం సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. వన్డేల్లోనూ ద్విశతకం బాదిన సెహ్వాగ్.. అంతర్జాతీయ కెరీర్‌లో 38 శతకాలు, 72 అర్ధశతకాలతో కలిపి 17,253 పరుగులు సాధించాడు.












