
న్యూఢిల్లీ, ఆగస్టు 26 (ప్రజా వీక్షణం ప్రతినిధి): పండుగ సీజన్ నేపథ్యంలో ఆన్లైన్ విక్రేతలకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చాయి. ఆర్డర్లను రద్దు చేయడం, సకాలంలో రవాణా చేయడంలో విఫలమవడం వంటి సందర్భాల్లో విక్రేతలపై అదనపు రుసుములు, జరిమానాలు విధించనున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా చిన్న, మధ్య తరహా ఆన్లైన్ వ్యాపారాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
అమెజాన్‌లో రద్దు రుసుము ఇలా..
ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. రూ.10,000 లోపు విలువైన ఆర్డర్లపై 10 శాతం, రూ.10,001 నుంచి రూ.50,000 మధ్య ఆర్డర్లపై 8 శాతం రద్దు రుసుము విధించనున్నారు. రూ.50,001 నుంచి రూ.లక్ష మధ్య ఆర్డర్లపై 5 శాతం, రూ.లక్షకు పైబడిన ఆర్డర్లపై 2 శాతం రుసుము ఉంటుంది. దీనికి అదనంగా 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. కొనుగోలుదారు స్వయంగా ఆర్డర్ రద్దు చేస్తే ఈ రుసుము విక్రేతకు వర్తించదు. విక్రేత రద్దు చేసినప్పుడు లేదా నిర్ణీత సమయంలో రవాణా ధ్రువీకరణ చేయకపోవడంతో ఆర్డర్ స్వయంచాలకంగా రద్దయితే రుసుము విధించవచ్చు.
మరో ఫీజు కూడా పెంపు
సెప్టెంబర్ 7 నుంచి రూ.500 వరకు ధర ఉన్న ఉత్పత్తులపై క్లోజింగ్ ఫీజును రూ.1, రూ.500కు పైబడిన ఉత్పత్తులపై రూ.3 చొప్పున పెంచనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. పెరిగిన ఇంధనం, రవాణా ఖర్చుల కారణంగా ఈ మార్పు చేసినట్లు సంస్థ తెలిపింది.
ఫ్లిప్‌కార్ట్‌లో రూ.90 వరకు జరిమానా
ఆగస్టు 23 నుంచి ఫ్లిప్‌కార్ట్ కూడా విక్రేతల కోసం నిబంధనలను కఠినతరం చేసింది. నిర్ణీత సమయంలో ఆర్డర్‌ను రవాణా భాగస్వామికి అందించకపోతే ఒక్కో సరుకుపై రూ.30 జరిమానా విధించవచ్చు. ఆర్డర్ స్వీకరించిన తర్వాత విక్రేత రద్దు చేస్తే రూ.60, రవాణా గడువు దాటిన తర్వాత రద్దు చేస్తే రూ.90 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
చిన్న వ్యాపారులపై భారం?
ఆర్డర్ల సంఖ్య పెరిగే పండుగ సీజన్లో నిల్వలు, ప్యాకింగ్, రవాణాను సమర్థంగా నిర్వహించడం విక్రేతలకు సవాలుగా మారనుంది. లాజిస్టిక్స్ ఆలస్యం, సరుకు కొరత వంటి కారణాలతో రద్దులు జరిగినా జరిమానాలు పడే అవకాశం ఉండటంతో చిన్న, మధ్య తరహా వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్త నిబంధనలు ప్రస్తుతం వినియోగదారులపై నేరుగా ఎలాంటి జరిమానాలు విధించవు. విక్రేతల ఖర్చులు పెరిగితే భవిష్యత్తులో కొన్ని ఉత్పత్తుల ధరలు, తగ్గింపులపై ప్రభావం పడే అవకాశం ఉంది.












