కెనడాపై అమెరికా ఆగ్రహం.. వాణిజ్య విధానాలపై తీవ్ర హెచ్చరిక

వాషింగ్టన్, ఆగస్టు 26 (ప్రజా వీక్షణం ప్రతినిధి): కెనడా దశాబ్దాలుగా అమెరికా నుంచి ఉచిత ప్రయోజనాలు పొందుతూ తమ దేశాన్ని మోసం చేస్తోందని వైట్‌హౌస్ తీవ్ర ఆరోపణలు చేసింది. కెనడా అనుసరిస్తున్న అన్యాయ, వివక్షపూరిత వాణిజ్య విధానాలను ఇకపై సహించబోమని హెచ్చరించింది. గత పదేళ్లలో కెనడా ఏటా సగటున 50 బిలియన్‌ డాలర్ల వాణిజ్య ప్రయోజనం పొందిందని, ప్రతిగా అమెరికాకు సమాన అవకాశాలు కల్పించలేదని పేర్కొంది.
అమెరికా ఆటోమొబైల్స్‌పై 25 శాతం సుంకాలు, డెయిరీ ఉత్పత్తులపై కఠిన పరిమితులు, ఆల్కహాల్ ఎగుమతులపై ఆంక్షలతో అమెరికా తీవ్రంగా నష్టపోయిందని వైట్‌హౌస్ తెలిపింది. కెనడా కొన్ని ఉత్పత్తులపై 400 శాతం వరకు టారిఫ్‌లు విధిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. కెనడా అమెరికాలోని రాష్ట్రం కాదని, ఆ దేశానికి ఎలాంటి ప్రత్యేక ఉచిత హక్కులు ఉండబోవని స్పష్టం చేశారు.
కెనడా తన మొత్తం ఎగుమతుల్లో 75 శాతం అమెరికాకే పంపుతోందని వైట్‌హౌస్ గుర్తుచేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ కెనడా కంటే 13 రెట్లు పెద్దదని పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
50 శాతం వరకు ప్రతీకార సుంకాలు
అమెరికా విధించిన సుంకాలపై కెనడా ప్రధాని మార్క్‌ కార్నే తీవ్రంగా స్పందించారు. అమెరికా ఉత్పత్తులపై 50 శాతం వరకు ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. కెనడియన్‌ కార్మికులు, పరిశ్రమలు, కుటుంబాల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాణిజ్య సుంకాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అదనంగా 7.5 బిలియన్‌ డాలర్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇప్పటికే సుమారు 25 బిలియన్‌ డాలర్ల మద్దతు అందించామని, తాజా చర్యలతో కెనడా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని కార్నే వెల్లడించారు.

error: Content is protected !!
Prajaveek Shanam