జడేజా ఖాతాలో చెత్త రికార్డు!

కొలంబో ఆగస్టు 26 (ప్రజా వీక్షణం ప్రతినిధి): టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు టెస్టు క్రికెట్‌లో నో బాల్స్ సమస్యగా మారుతోంది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులోనూ ఈ సమస్య కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో మూడు, రెండో ఇన్నింగ్స్‌లో మరో నోబాల్‌ వేయడంతో.. 2021 నుంచి టెస్టుల్లో జడేజా వేసిన నో బాల్స్ సంఖ్య 88కి చేరింది. దీంతో టెస్టు క్రికెట్‌లో అత్యధిక నో బాల్స్ వేసిన స్పిన్నర్‌గా జడేజా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
88 నో బాల్స్‌తో అగ్రస్థానం
టెస్టుల్లో స్పిన్నర్ల నో బాల్స్ జాబితాలో జడేజా 88తో తొలి స్థానంలో ఉన్నాడు. పాకిస్థాన్ స్పిన్నర్ నోమన్ అలీ 40 నో బాల్స్‌తో రెండో స్థానంలో ఉండగా.. లసిత్ ఎంబుల్డెనియా 33, జాక్ లీచ్ 19 నో బాల్స్‌తో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఫాలోఆన్‌లో లంక పోరాటం
భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేయగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ఫాలోఆన్ విధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 229 పరుగులు చేసింది.
సెంచరీకి దూరంగా సూర్యబండారా
శ్రీలంక బ్యాటర్ పసిందు సూర్యబండారా 92 పరుగులతో అద్భుతంగా రాణించాడు. సెంచరీకి కేవలం 8 పరుగుల దూరంలో పెవిలియన్ చేరాడు. కమిందు మెండిస్ 55 పరుగులు చేశాడు. వర్షం కారణంగా ఆటను ముందుగానే నిలిపివేయగా.. సోనల్ దినుశా (7), కేషరా నువాంత (3) క్రీజులో ఉన్నారు. శ్రీలంక ప్రస్తుతం భారత్ కంటే 16 పరుగుల ఆధిక్యంలో ఉంది.

error: Content is protected !!
Prajaveek Shanam