27 ఏళ్లకే క్రికెట్‌కు వీడ్కోలు.. స్కూల్‌పై పుకోవిస్కీ దావా

మెల్‌బోర్న్ఆగస్టు 26 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ విల్ పుకోవిస్కీ 27 ఏళ్ల వయసులోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వరుసగా ఎదురైన కంకషన్‌ గాయాల కారణంగా అతడి క్రికెట్‌ కెరీర్‌ అర్ధంతరంగా ముగిసింది. తాజాగా తన కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన తొలి కంకషన్‌ ఘటనకు సంబంధించి తాను చదువుకున్న బ్రైటన్‌ గ్రామర్‌ స్కూల్‌పై పుకోవిస్కీ న్యాయపోరాటానికి దిగాడు.
2014లో 16 ఏళ్ల వయసులో స్కూల్‌లో జరిగిన ఆస్ట్రేలియన్‌ రూల్స్‌ ఫుట్‌బాల్‌ శిక్షణలో పాల్గొన్న సమయంలో పుకోవిస్కీ తలకు తీవ్ర గాయమైంది. అయితే గాయం తర్వాత స్కూల్‌ యాజమాన్యం సరైన వైద్యం అందించలేదని, దెబ్బ తగిలిన కొద్ది నిమిషాలకే తనను తిరిగి శిక్షణలోకి పంపించారని అతడు ఆరోపించాడు. ఆ గాయం ప్రభావంతో కొన్ని నెలల పాటు స్కూల్‌కు కూడా వెళ్లలేకపోయానని పేర్కొన్నాడు.
కెరీర్‌లో 13 కంకషన్లు
తొలి గాయం తర్వాత పుకోవిస్కీని కంకషన్లు వెంటాడాయి. క్రికెట్‌ ఆడుతున్న సమయంలో అతడికి మొత్తం 13 కంకషన్లు నమోదయ్యాయి. చివరకు 2024లో స్వతంత్ర వైద్య నిపుణుల బృందం క్రికెట్‌ నుంచి తప్పుకోవాలని సిఫారసు చేయడంతో అతడు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.
పుకోవిస్కీ ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున కేవలం ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 36 మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. ప్రతిభావంతమైన బ్యాటర్‌గా గుర్తింపు పొందినప్పటికీ.. వరుస కంకషన్‌ గాయాలు అతడి కెరీర్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇప్పుడు తనకు జరిగిన నష్టానికి స్కూల్‌ యాజమాన్యమే బాధ్యత వహించాలంటూ అతడు దావా వేయడం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

error: Content is protected !!
Prajaveek Shanam