51 ఏళ్ల వయసులో ఫైఫర్‌.. చరిత్ర సృష్టించిన జోవాన్నే హిక్స్‌!

రొమేనియా, ఆగస్టు 29 (ప్రజా వీక్షణం ప్రతినిధి) :

క్రికెట్‌ చరిత్రలో ఓ అరుదైన ఘట్టం నమోదైంది. వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ మహిళా క్రికెటర్‌ జోవాన్నే హిక్స్‌ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 51 ఏళ్ల వయసులో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసి.. దాదాపు 94 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.రొమేనియాలో జరుగుతున్న మహిళల కాంటినెంటల్‌ కప్‌లో గ్రీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్‌స్పిన్నర్‌ జోవాన్నే హిక్స్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఐదు వికెట్లు పడగొట్టింది. ఆమె ధాటికి గ్రీస్‌ జట్టు 15 ఓవర్లలో 52 పరుగులకే ఆలౌటైంది. అనంతరం ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ జట్టు 6 ఓవర్లలోనే ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
94 ఏళ్ల క్రితం రికార్డు
హిక్స్‌ ప్రదర్శనతో 1932లో ఆస్ట్రేలియా బౌలర్‌ బర్ట్‌ ఐరన్‌మాంగర్‌ నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 49 ఏళ్ల వయసులో ఐదు వికెట్లు తీసిన ఐరన్‌మాంగర్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వయసులో ఫైఫర్‌ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పుడు 51 ఏళ్ల హిక్స్‌ ఆ రికార్డును అధిగమించింది.
40 ఏళ్ల వయసులో క్రికెట్‌లోకి..
జోవాన్నే హిక్స్‌ 40 ఏళ్ల వయసులో మహిళల క్రికెట్‌ ఆడటం ప్రారంభించడం విశేషం. అయినప్పటికీ పట్టుదలతో రాణిస్తూ ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగింది. ఇప్పటివరకు 22 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 33 వికెట్లు తీసుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఆమెకు ఇది మూడో ఐదు వికెట్ల ప్రదర్శన. 50 ఏళ్లు దాటిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో ఫైఫర్‌ సాధించిన తొలి బౌలర్‌గా హిక్స్‌ చరిత్రలో నిలిచింది.

error: Content is protected !!
Prajaveek Shanam