గొల్లపల్లి అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

కరీంనగర్, ఆగస్టు 30 (ప్రజా వీక్షణం ప్రతినిధి): భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. “పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన” కార్యక్రమంలో భాగంగా ఆదివారం గొల్లపల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని, అధికారులతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు పరిహారం అందజేస్తూ పనులను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి త్వరలోనే నీటిని విడుదల చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయితే రైతాంగానికి గణనీయమైన ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గొల్లపల్లికి ఓపెన్ జిమ్, వాటర్ ప్లాంట్ మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని చెప్పారు. గ్రామంలో స్థల సేకరణ పూర్తయిన వెంటనే గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు, మహిళా భవనానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆరుతడి పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. నీటి సంరక్షణ కోసం ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. నీటి వనరుల పరిరక్షణ ద్వారా భవిష్యత్ తరాలకు ఉపయోగకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చని పేర్కొన్నారు.
గ్రామ యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి తెలిపారు. అవసరమైన క్రీడా సామగ్రిని అందించడంతో పాటు క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువత శారీరక దృఢత్వంతో పాటు క్రీడా రంగంలో ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గొల్లపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam