అనుష్క తొలి ప్రేమ జ్ఞాపకం

హైదరాబాద్, ఆగస్టు 30 (ప్రజా వీక్షణం ప్రతినిధి) : దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి.. తన చిన్ననాటి తొలి ప్రేమ జ్ఞాపకాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను ఆరో తరగతి చదువుతున్న సమయంలో ఓ అబ్బాయి తనకు నేరుగా ‘ఐ లవ్ యు’ చెప్పాడని అనుష్క గుర్తుచేసుకున్నారు.
ఆ వయసులో ‘ఐ లవ్ యు’ అంటే ఏమిటో కూడా తనకు తెలియదని, అందుకే అమాయకంగా ‘సరే’ అని సమాధానం ఇచ్చానని నవ్వుతూ చెప్పారు. ఆ సంఘటన తన జీవితంలో అత్యంత అమాయకమైన, అందమైన జ్ఞాపకంగా మిగిలిపోయిందని తెలిపారు.
పెళ్లిపై అనుష్క ఏమన్నారంటే?
నలభై ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకపోవడంతో అనుష్క వ్యక్తిగత జీవితంపై తరచూ పుకార్లు వస్తుంటాయి. అయితే సరైన వ్యక్తి ఎదురైనప్పుడు సహజంగానే పెళ్లి జరుగుతుందని ఆమె గతంలో పేర్కొన్నారు. తన వివాహ విషయాన్ని తల్లిదండ్రులకే వదిలేశానని, పెళ్లి కుదిరిన రోజున అందరికీ బహిరంగంగా తెలియజేస్తానని స్పష్టం చేశారు.
నటనతో ప్రత్యేక గుర్తింపు
సినిమా రంగంలోకి రాకముందు ముంబైలో యోగా శిక్షకురాలిగా పనిచేసిన అనుష్క.. ‘సూపర్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘భాగమతి’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచే అనుష్క.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లకు దూరంగా ఉంటారు.

error: Content is protected !!
Prajaveek Shanam