పోర్షే ఎలక్ట్రిక్ కారు వచ్చేస్తోంది.. ధర రూ.1.77 కోట్లు!

న్యూఢిల్లీ, ఆగస్టు 30 (ప్రజా వీక్షణంప్రతినిధి): విలాసవంతమైన కార్ల ప్రియులను ఆకట్టుకునేలా పోర్షే సంస్థ తన కయెన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని భారత మార్కెట్లోకి తీసుకురానుంది. సెప్టెంబర్‌ 30న ఈ ఎలక్ట్రిక్‌ కారు విడుదల కానుంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర సుమారు రూ.1.77 కోట్లుగా ఉండనుంది.
అదిరిపోయే వేగం.. 2.5 సెకన్లలో 100 కిలోమీటర్లు
కయెన్‌ ఎలక్ట్రిక్‌లో 113 కిలోవాట్‌ బ్యాటరీ ఉంటుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే గరిష్ఠంగా 643 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అత్యంత శక్తివంతమైన కయెన్‌ టర్బో ఎలక్ట్రిక్‌ కేవలం 2.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 260 కిలోమీటర్లు.
16 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జింగ్‌
ఈ వాహనంలో 800 వోల్ట్‌ ఛార్జింగ్‌ సాంకేతికత ఉంది. అధిక సామర్థ్యం ఉన్న ఛార్జింగ్‌ కేంద్రంలో 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని సుమారు 16 నిమిషాల్లో ఛార్జ్‌ చేయవచ్చు. ఇంట్లో 11 కిలోవాట్‌ వరకు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సౌకర్యాన్ని కూడా అదనంగా పొందవచ్చు.
అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన క్యాబిన్‌
కయెన్‌ ఎలక్ట్రిక్‌లో 14.5 అంగుళాల వంపు తిరిగిన సమాచార తెర, 14.9 అంగుళాల ముందు ప్రయాణికుల తెర, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ హెడ్‌అప్‌ డిస్‌ప్లే వంటి సౌకర్యాలు ఉన్నాయి. ముందు భాగంలో 90 లీటర్ల నిల్వ, వెనుక 781 లీటర్ల సామాను స్థలం లభిస్తుంది. భారతదేశంలో కయెన్‌ టర్బో ఎలక్ట్రిక్‌ ధర రూ.2.27 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది.

error: Content is protected !!
Prajaveek Shanam