900 వికెట్ల క్లబ్‌లో మహ్మద్‌ షమీ.. అరుదైన ఘనత!

ముంబై, ఆగస్టు 31 (ప్రజా వీక్షణం ప్రతినిధి): టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ దేశవాళీ క్రికెట్‌లో తన బౌలింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. తాజాగా దులీప్‌ ట్రోఫీలో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. సెమీఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ తరఫున ఆడుతున్న షమీ.. సెంట్రల్‌ జోన్‌పై రెండు వికెట్లు తీసి ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో 900 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు.
900 వికెట్లు.. భారత్‌లో ఆరో బౌలర్‌.. ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌-ఏ, టీ20 క్రికెట్‌లో కలిపి షమీ ఖాతాలో 900 వికెట్లు చేరాయి. తద్వారా భారత్‌ తరఫున ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఆరో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. షమీ ఫస్ట్‌క్లాస్‌లో 379, లిస్ట్‌-ఏలో 283, టీ20ల్లో 238 వికెట్లు పడగొట్టాడు.
కపిల్‌ దేవ్‌ టాప్‌.. ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కపిల్‌ దేవ్‌ 1170 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. జహీర్‌ ఖాన్‌ 1168 వికెట్లతో రెండో స్థానంలో, జయదేవ్‌ ఉనద్కత్‌ 941 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నారు. జవగల్‌ శ్రీనాథ్‌ 940, వినయ్‌ కుమార్‌ 923 వికెట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అభినందనలు.. షమీ 900 వికెట్ల మైలురాయిని అందుకోవడంపై బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అభినందనలు తెలిపింది. ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో 900 వికెట్లు సాధించడం అంత సులభం కాదని, టీమిండియా పేసర్‌గా షమీ సాధించిన ఈ ఘనతపై గర్వంగా ఉందని పేర్కొంది.

error: Content is protected !!
Prajaveek Shanam