గూడూరు ప్రజా వీక్షణం 01 సెప్టెంబర్
చెన్నూరు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా చెన్నూరు బీసీ కాలనీలో కొత్తగా మంజూరైన స్పౌస్ పెన్షన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు మట్టం శ్రావణి రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా పెన్షన్ మంజూరు కావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితరులకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛను పథకాల ప్రయోజనం అర్హులకు అందేలా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే చొరవతో నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి పనులకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు చేపడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రజల అవసరాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా స్థానిక నాయకులు, కార్యకర్తలు సహకరించాలని శ్రావణి రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.












