జనసేన యువజన విభాగం ఆవిష్కరణకు ఘన ఏర్పాట్లు

పిఠాపురం, సెప్టెంబర్ 1 (ప్రజా వీక్షణం ప్రతినిధి): జనసేన పార్టీ యువజన విభాగం ఆవిష్కరణను పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం పిఠాపురంలో నిర్వహించనున్న కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ యువజన విభాగం రాజకీయాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే కాకుండా, యువత ఆలోచనలను సమాజానికి చేరవేసే వేదికగా పనిచేస్తుందని పేర్కొన్నారు. “దేశమే ఫస్ట్” అనే నినాదంతో బాధ్యతాయుతమైన యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దే లక్ష్యంతో యువజన విభాగం ముందుకు సాగుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను యువతలోకి తీసుకెళ్లడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
పిఠాపురంలో యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన లోగో, గీతం, ప్రచార చిత్రాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు ఘనంగా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నాయని తెలిపారు. పోలీసుల అనుమతులతో బైక్ ర్యాలీలు, యువత భాగస్వామ్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. మొదటగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక సందేశాన్ని కార్యక్రమంలో ప్రసారం చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుతం ఆయన కేరళలో చికిత్స పొందుతున్న ప్రాంతంలో సాంకేతిక సమస్యలు ఉన్న కారణంగా అది సాధ్యంకాకపోవచ్చని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అయినప్పటికీ పిఠాపురంలో జరిగే ప్రధాన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
యువతకు రాజకీయాల్లో మరింత అవకాశాలు కల్పించాలన్నది జనసేన లక్ష్యమని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు, మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలోనూ యువతను భాగస్వామ్యం చేయాలని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. యువతలో సేవాభావం, నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా యువజన విభాగం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ తలాటం సత్యతో పాటు పలువురు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam