హైదరాబాద్, సెప్టెంబర్ 1 (ప్రజా వీక్షణం ప్రతినిధి): హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దాలన్న తెలంగాణ ప్రభుత్వ దృష్టికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్య, నైపుణ్యాభివృద్ధి, క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థలు తెలంగాణతో భాగస్వామ్యం కావడానికి ముందుకు రావడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ లండన్, అమెరికాలోని బోస్టన్‌కు చెందిన నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో తమ ఆఫ్‌షోర్ క్యాంపస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ప్రపంచ స్థాయి విద్యను తెలంగాణ యువతకు అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు ఇది కీలక ఫలితమని పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను హైదరాబాద్‌లోనే అభ్యసించే అవకాశం యువతకు లభించనుందని తెలిపారు.
ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీతో పాటు దాని అనుబంధ విద్యా విభాగాలు తెలంగాణలో ప్రత్యేక కోర్సులు, ఎంపిక చేసిన విద్యా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయని సీఎం వెల్లడించారు. అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (సోఆస్), ఇంపీరియల్ కాలేజ్ లండన్, లండన్ బిజినెస్ స్కూల్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రముఖ విద్యాసంస్థలతో జరిగిన చర్చలు కూడా సానుకూల ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)తో పాటు పలు ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలతో నిర్వహించిన సమావేశాలు కూడా ఆశాజనకంగా సాగాయని సీఎం పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణ యువత ప్రపంచ స్థాయి విద్య, పరిశోధన అవకాశాలను తమ స్వరాష్ట్రంలోనే పొందగలరని చెప్పారు. విద్యా రంగంలో తెలంగాణను అంతర్జాతీయంగా మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
విద్యా కోర్సులు, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లు, సంయుక్త పరిశోధనలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు, వివిధ రంగాల నిపుణులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు వంటి అంశాల్లో అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో విద్యా, పరిశోధన రంగాలు మరింత బలోపేతం అవుతాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ యువతను ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనే స్థాయికి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నైపుణ్యాలు, క్రీడలు, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం ఇస్తూ హైదరాబాద్‌ను ప్రపంచ విద్యా శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధనలో ఈ భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషించనున్నాయని ఆయన తెలిపారు.












