జీఎస్టీ వసూళ్లలో జోరు!

న్యూఢిల్లీ సెప్టెంబర్‌ 01 (ప్రజా వీక్షణం ప్రతినిధి): దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధి దిశగా సాగుతున్నదనడానికి సంకేతంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు మరోసారి ఆశాజనకంగా నమోదయ్యాయి. ఆగస్టు నెలలో ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా రూ.1,99,853 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఆగస్టులో నమోదైన రూ.1,74,116 కోట్లతో పోలిస్తే ఈసారి వసూళ్లు 14.8 శాతం పెరిగాయి. దాదాపు రూ.2 లక్షల కోట్ల మార్కుకు చేరువ కావడం విశేషం.
దిగుమతులపై పన్నుల వసూళ్లు భారీగా పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణంగా నిలిచింది. దిగుమతులపై స్థూల జీఎస్టీ ఆదాయం 29 శాతం పెరిగి రూ.62,604 కోట్లకు చేరింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన జీఎస్టీ కూడా 9.3 శాతం వృద్ధితో రూ.1,37,249 కోట్లుగా నమోదైంది.
రిఫండ్‌లు కూడా భారీగా పెరుగుదల
ఆగస్టులో ప్రభుత్వం చెల్లించిన జీఎస్టీ రిఫండ్‌లు గతేడాదితో పోలిస్తే 67.9 శాతం పెరిగి రూ.31,795 కోట్లకు చేరాయి. దీంతో రిఫండ్‌లను మినహాయించిన తర్వాత ప్రభుత్వానికి లభించిన నికర జీఎస్టీ ఆదాయం రూ.1,68,057 కోట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే నికర ఆదాయం 8.3 శాతం మాత్రమే పెరిగింది.
దేశీయ నికర వసూళ్లలో స్వల్ప వృద్ధి
నికర వసూళ్లలో కస్టమ్స్ జీఎస్టీ ఆదాయం 22.3 శాతం వృద్ధితో రూ.49,299 కోట్లకు చేరింది. అయితే దేశీయ నికర జీఎస్టీ వసూళ్లు కేవలం 3.4 శాతం వృద్ధితో రూ.1,18,759 కోట్లుగా నమోదయ్యాయి. దేశీయంగా రిఫండ్‌లు భారీగా పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
57వ జీఎస్టీ కౌన్సిల్‌పై ఆసక్తి
జీఎస్టీ వసూళ్ల గణాంకాలు వెలువడిన నేపథ్యంలో సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరగనున్న 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంపై ఆసక్తి నెలకొంది. సమావేశానికి ఒకరోజు ముందు సెప్టెంబర్ 11న అధికారుల స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో పన్నులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

error: Content is protected !!
Prajaveek Shanam