ఆసియా గేమ్స్‌కు భారత దళం సిద్ధం

జపాన్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభం కానున్న ఆసియా క్రీడలకు భారత క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. గత ఆసియా క్రీడల్లో సాధించిన 106 పతకాల రికార్డును అధిగమించి ఈసారి కూడా వందకు పైగా పతకాలు సాధించాలనే లక్ష్యంతో భారత బృందం బరిలోకి దిగుతోంది. మొత్తం 45 దేశాలకు చెందిన వేలాది మంది క్రీడాకారులు 43 క్రీడాంశాల్లో తమ ప్రతిభను చాటుకోనున్నారు.ఈసారి ఆసియా క్రీడలకు భారత్‌ నుంచి 768 మందితో కూడిన భారీ బృందం జపాన్‌కు వెళ్లనుంది. ఇందులో 503 మంది క్రీడాకారులు ఉండగా.. 269 మంది పురుషులు, 234 మంది మహిళలు ఉన్నారు. మిగిలిన వారిలో అధికారులు, సహాయక సిబ్బంది, బృంద నిర్వహణ సిబ్బంది ఉన్నారు. భారత క్రీడా మంత్రిత్వ శాఖ తీసుకున్న చర్యలతో గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది క్రీడాకారులకు ఆసియా క్రీడల్లో పాల్గొనే అవకాశం లభించింది.భారత క్రీడాకారులు మొత్తం 36 క్రీడాంశాల్లో పతకాల కోసం పోటీపడనున్నారు. ఇందులో సర్ఫింగ్‌ భారత్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆసియా క్రీడల చరిత్రలో తొలిసారిగా భారత క్రీడాకారులు సర్ఫింగ్‌లో పోటీపడనున్నారు. దీంతో కొత్త క్రీడాంశంలోనూ పతకం సాధించాలని భారత బృందం ఆశిస్తోంది.అయితే పోటీలు ప్రారంభం కాకముందే భారత బృందానికి కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. పారిస్‌ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా గాయం కారణంగా ఆసియా క్రీడల నుంచి తప్పుకున్నాడు. క్రికెట్‌లో కీలక బ్యాటర్‌ జెమిమా రోడ్రిగ్స్‌ కూడా గాయం కారణంగా దూరమయ్యారు. మరోవైపు నిషేధిత ఉత్ప్రేరక నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి రెజ్లర్లు ముకుల్‌ దహియా, దీపాంశు, షూటర్‌ గౌరవ్‌ కుమార్‌పై చర్యలు తీసుకున్నారు. గౌరవ్‌ స్థానంలో ఆకాష్‌ భరద్వాజ్‌కు జట్టులో చోటు కల్పించారు.అత్యధిక పతకాలు అందించే క్రీడాంశాల్లో ఒకటైన అథ్లెటిక్స్‌పై ఈసారి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆసియా క్రీడల అథ్లెటిక్స్‌లో భారత్‌ 85 స్వర్ణాలతో కలిపి 283 పతకాలు సాధించింది. ఈ అనుభవాన్ని కొనసాగిస్తూ ఈసారి మరిన్ని పతకాలు సాధించాలని భారత అథ్లెట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇక ఒలింపిక్‌ పతక విజేతలు పీవీ సింధు, మీరాబాయి చాను, మను భాకర్‌ తమ తమ విభాగాల్లో భారత్‌ పతకాల ఆశలను ముందుకు తీసుకెళ్లనున్నారు. క్రికెట్‌లో పురుషుల జట్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యం వహించనుండగా.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై ప్రత్యేక దృష్టి నెలకొంది. కబడ్డీలో పురుషుల, మహిళల జట్లు గతసారి సాధించిన స్వర్ణ పతకాలను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాయి.
హాకీలోనూ భారత్‌ నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. పురుషుల జట్టు ఐదోసారి ఆసియా క్రీడల విజేతగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహిళల జట్టు మాత్రం 1982 తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించలేకపోయిన లోటును ఈసారి భర్తీ చేయాలని భావిస్తోంది.భారత క్రీడా ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. 2018 ఆసియా క్రీడల్లో భారత్‌ 70 పతకాలు సాధించింది. 2022 హాంగ్‌జౌ క్రీడల్లో ఏకంగా 106 పతకాలు సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి వందకు పైగా పతకాలతో పాటు మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే పట్టుదలతో భారత క్రీడాకారులు జపాన్‌కు పయనమవుతున్నారు. సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభమయ్యే పోటీల్లో భారత్‌ ఎన్ని పతకాలు సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 03 (ప్రజా వీక్షణం ప్రతినిధి):

error: Content is protected !!
Prajaveek Shanam