ధోని ఫుల్‌టైమ్‌ ఆడతాడు!

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఒకటి. ఈ జట్టు పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు మహేంద్రసింగ్‌ ధోని. భారత జట్టుకు నీలి జెర్సీలో ఎంతటి ప్రభావం చూపించాడో.. చెన్నై జట్టుకు పసుపు జెర్సీలోనూ అదే స్థాయిలో తనదైన ముద్ర వేశాడు. అయితే గత సీజన్‌లో ధోని పూర్తిస్థాయి ఆటగాడిగా మైదానంలో ఎక్కువసేపు కనిపించకపోవడంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.ఇక వచ్చే ఐపీఎల్‌లోనూ ధోని కేవలం ప్రభావిత ఆటగాడిగానే జట్టులో కొనసాగుతాడనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎస్కే మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రినాథ్‌ ధోని అభిమానులకు ఆసక్తికరమైన విషయం వెల్లడించాడు. 2027 ఐపీఎల్‌లో ధోని పూర్తిస్థాయి వికెట్‌ కీపర్‌గా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని తనతో చెప్పినట్లు బద్రినాథ్‌ పేర్కొన్నాడు.
తన యూట్యూబ్‌ కార్యక్రమంలో బద్రినాథ్‌ మాట్లాడుతూ.. ధోని తనతో వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాన్ని వెల్లడించాడు. ప్రభావిత ఆటగాడిగా కాకుండా పూర్తిస్థాయి వికెట్‌ కీపర్‌గా ఆడతానని ధోని చెప్పినట్లు పేర్కొన్నాడు. అదే జరిగితే ధోని మొత్తం 20 ఓవర్ల పాటు మైదానంలో ఉండాల్సి వస్తుందని తెలిపాడు.అయితే ధోని శరీరం అంతసేపు సహకరిస్తుందా అనే అంశమే అసలు ప్రశ్న అని బద్రినాథ్‌ అభిప్రాయపడ్డాడు. వయసు, శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతడి నిర్ణయం కీలకంగా మారుతుందని చెప్పాడు. ధోని సాధారణంగా ఇన్నింగ్స్‌ చివరి దశలో బ్యాటింగ్‌కు వస్తుంటాడని, ముఖ్యంగా 16 లేదా 17వ ఓవర్‌ తర్వాత క్రీజులోకి వచ్చే సందర్భాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నాడు.
బ్యాటింగ్‌లో ధోని పాత్ర ప్రస్తుతం పరిమితంగానే ఉన్నప్పటికీ.. వికెట్‌ కీపింగ్‌, మైదానంలో అతడి నాయకత్వ అనుభవం సీఎస్కేకు ఎంతో ఉపయోగపడుతుందని బద్రినాథ్‌ చెప్పాడు. ధోని నిజంగానే పూర్తిస్థాయి ఆటగాడిగా బరిలోకి దిగితే చెన్నై జట్టుకు అదనపు ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డాడు.ఇదే సమయంలో యువ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే విషయంలోనూ బద్రినాథ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. దూబే బౌలింగ్‌ భారత జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని, అయితే సీఎస్కేకు మాత్రం అతడి బౌలింగ్‌ అవసరం అంతగా లేదని పేర్కొన్నాడు. అందువల్ల దూబే విషయంలో ప్రభావిత ఆటగాడి నిబంధనను ఉపయోగించాల్సిన అవసరం లేదని అన్నాడు.అలాగే అఖీల్‌ హుస్సేన్‌ను సీఎస్కే తుది జట్టులో తప్పకుండా కొనసాగించాలని బద్రినాథ్‌ సూచించాడు. అయితే చెన్నై జట్టు అతడిని ప్రభావిత ఆటగాడిగా ఉపయోగించుకుంటోందని పేర్కొన్నాడు. ప్రభావిత ఆటగాడి నిబంధనను తప్పుబట్టాల్సిన అవసరం లేదని, అందుబాటులో ఉన్న అవకాశాన్ని ఏ జట్టు ఎలా ఉపయోగించుకుంటుందనేది వారి వ్యూహంపై ఆధారపడి ఉంటుందని వివరించాడు.
ధోని 2027 ఐపీఎల్‌లో పూర్తిస్థాయి వికెట్‌ కీపర్‌గా ఆడతాడన్న బద్రినాథ్‌ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ధోని నిజంగానే మొత్తం మ్యాచ్‌లో వికెట్ల వెనుక కనిపిస్తాడా? బ్యాటింగ్‌లో ఎలాంటి పాత్ర పోషిస్తాడు? అన్నది వచ్చే సీజన్‌ ప్రారంభమయ్యే వరకు ఉత్కంఠగా మారనుంది.

సెప్టెంబర్‌ 03 (ప్రజా వీక్షణం ప్రతినిధి):

error: Content is protected !!
Prajaveek Shanam