ముంబై, సెప్టెంబర్ 03 (ప్రజా వీక్షణం ప్రతినిధి): ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ తన 70వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారుల కోసం రెండు కొత్త బీమా పథకాలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘బీమా ప్లాటినమ్’, ‘జీవన్ రక్ష’ పేరుతో ఈ పథకాలను ప్రారంభించింది. మారుతున్న ఆర్థిక అవసరాలు, కుటుంబ రక్షణ, భవిష్యత్ పొదుపును దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందించినట్లు సంస్థ వెల్లడించింది.
‘బీమా ప్లాటినమ్’ పథకం పొదుపుతో పాటు బీమా రక్షణను అందించే పథకంగా రూపొందించారు. ఇది అనుసంధానం లేని బీమా పథకం కావడంతో మార్కెట్ పరిస్థితులతో నేరుగా ముడిపడి ఉండదు. చెల్లించే ప్రతి రూ.1,000 వార్షిక ప్రీమియంపై రూ.70 చొప్పున హామీ అదనపు మొత్తం లభిస్తుంది. అలాగే పాలసీ విలువ ఆధారంగా ప్రతి ఏడాది 10 శాతం వరకు క్రమం తప్పకుండా ఆదాయం పొందే అవకాశం కల్పించారు. ఈ పథకాన్ని 10 నుంచి 20 సంవత్సరాల కాలపరిమితితో ఎంచుకోవచ్చు.
ఇక ‘జీవన్ రక్ష’ పూర్తిస్థాయి టర్మ్ బీమా పథకం. పాలసీ కాలంలో బీమాదారుడు మరణిస్తే, నిబంధనల ప్రకారం కుటుంబ సభ్యులకు బీమా మొత్తం అందుతుంది. తద్వారా కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకంలో కనిష్ఠంగా రూ.5 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.24 లక్షల వరకు బీమా రక్షణ పొందే అవకాశం ఉంది.
మహిళా పాలసీదారులకు ప్రత్యేక ప్రీమియం రాయితీ కల్పించడం ‘జీవన్ రక్ష’లో మరో ముఖ్యమైన అంశంగా ఎల్ఐసీ పేర్కొంది. కుటుంబ ఆర్థిక భద్రతను బలోపేతం చేసుకోవాలనుకునే వారికి ఈ పథకం ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ తెలిపింది.
ఈ సందర్భంగా ఎల్ఐసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్. దొరైస్వామి మాట్లాడుతూ.. ప్రజల ఆదాయాలు పెరగడం, ఆర్థిక అంశాలపై అవగాహన మెరుగుపడటంతో బీమా రక్షణ, పొదుపు, పదవీ విరమణకు సంబంధించిన పథకాలకు డిమాండ్ పెరుగుతోందన్నారు. వినియోగదారుల మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త పథకాలను రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.
70వ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ రెండు పథకాల ద్వారా వివిధ వర్గాల వినియోగదారులకు రక్షణతో పాటు భవిష్యత్ ఆర్థిక ప్రణాళికకు మరిన్ని అవకాశాలు కల్పించడమే ఎల్ఐసీ లక్ష్యంగా కనిపిస్తోంది.












