హైదరాబాద్, సెప్టెంబర్ 03 (ప్రజా వీక్షణంప్రతినిధి): జాతీయ స్థాయిలో రష్మిక మందన్న మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ జాతీయ పత్రిక ‘ఇండియా టుడే’ దేశంలోని అగ్ర కథానాయికల జాబితాలో రష్మికకు మొదటి స్థానం కల్పించినట్లు సమాచారం. ఆమెను ‘కొత్త జాతీయ తార’గా అభివర్ణిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించినట్లు తెలుస్తోంది.వరుస విజయాలతో రష్మిక తన పాన్ ఇండియా స్థాయిని మరింత పెంచుకున్నారు. ‘పుష్ప: ది రైజ్’, ‘యానిమల్’, ‘పుష్ప-2: ది రూల్’, ‘ఛావా’ వంటి చిత్రాలతో దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు భారీగా అభిమానులను సంపాదించుకున్నారు. విభిన్న భాషల్లో నటిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడమే కాకుండా, కథానాయికగా తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇండియా టుడే జాబితాలో దీపికా పదుకోన్, శ్రద్ధా కపూర్, అలియా భట్, సాయి పల్లవి వంటి ప్రముఖ కథానాయికలను వెనక్కి నెట్టి రష్మిక అగ్రస్థానంలో నిలిచినట్లు సమాచారం. దీంతో ఆమెకు దక్కిన ఈ గుర్తింపు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.రష్మిక వరుసగా భారీ చిత్రాల్లో భాగం కావడం, ఆయా సినిమాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆమెకు కలిసొచ్చిన అంశాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ‘పుష్ప’ చిత్రంలోని శ్రీవల్లి పాత్రతో ఉత్తరాది ప్రేక్షకుల్లోనూ ఆమెకు విపరీతమైన ఆదరణ లభించింది. ఆ తర్వాత ‘యానిమల్’, ‘పుష్ప-2’, ‘ఛావా’ వంటి చిత్రాలు ఆమెకు మరింత జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చాయి.
ఈ అరుదైన గుర్తింపుపై రష్మిక భర్త, హీరో విజయ్ దేవరకొండ కూడా ఆనందం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇండియా టుడే పత్రిక ముఖచిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న విజయ్.. రష్మికను అభినందిస్తూ ఆమె సాధించిన విజయంపై గర్వంగా ఉందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లోనూ ఆసక్తిని పెంచాయి.
విజయ్ దేవరకొండ అభినందనలతో పాటు సినీ అభిమానులు కూడా రష్మికకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. దక్షిణాది కథానాయికగా కెరీర్ను ప్రారంభించి జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం అభినందనీయమని అభిమానులు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం రష్మిక చేతిలోనూ పలు భారీ చిత్రాలు ఉన్నాయి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆమెకు జాతీయ స్థాయిలో లభిస్తున్న గుర్తింపు భవిష్యత్ చిత్రాలపై అంచనాలను మరింత పెంచుతోంది.












