హైదరాబాద్, సెప్టెంబర్ 03 (ప్రజా వీక్షణం ప్రతినిధి): సినీ పరిశ్రమలో బహుముఖ ప్రతిభ కలిగిన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు. అందం, సహజమైన నటనతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు భారీగా అభిమానులు ఉన్నారు. నాని కథానాయకుడిగా నటించిన ‘అలా మొదలైంది’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యా.. ఆ తర్వాత వరుస విజయవంతమైన చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
ఇటీవల సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న నిత్యా మీనన్.. కథ, పాత్ర నచ్చితేనే సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె నటించే చిత్రాల మధ్య కొంత విరామం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా, గతంలో ఒక ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ తన పేరు గురించి చెప్పిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
అసలు పేరు ‘ఎన్.ఎస్. నిత్య’
తన అసలు పేరు నిత్యా మీనన్ కాదని ఆమె గతంలో వెల్లడించారు. తన కుటుంబ సభ్యులు పెట్టిన పేరు ‘ఎన్.ఎస్. నిత్య’ అని తెలిపారు. తాను మలయాళీని అని చాలామంది భావిస్తుంటారని, తన పేరు కారణంగా అలా అనుకోవడం తనకు నవ్వు తెప్పిస్తుందని పేర్కొన్నారు.
తన తండ్రి పేరు సుకుమార్, తల్లి పేరు నళిని అని చెప్పిన నిత్యా.. వారి పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ‘ఎన్.ఎస్. నిత్య’గా పేరు పెట్టినట్లు వివరించారు. తమ కుటుంబంలో ఇంటిపేర్లను ఉపయోగించే సంప్రదాయం లేదని, పేరుతో కులాన్ని గుర్తించే విధానాన్ని కూడా తమ కుటుంబం ఇష్టపడదని ఆమె చెప్పారు.
పాస్‌పోర్ట్ కోసం ‘మీనన్’ జత
తన తండ్రి, తల్లి వేర్వేరు సామాజిక వర్గాలకు చెందినవారని గతంలో నిత్యా వెల్లడించారు. అందుకే తన పేరులో ఎలాంటి కుల గుర్తింపు ఉండకూడదని తల్లిదండ్రులు భావించారని తెలిపారు. అయితే నటిగా వృత్తిపరంగా దేశ విదేశాల్లో ప్రయాణించాల్సి రావడంతో పాస్‌పోర్ట్ తదితర అధికారిక అవసరాల కోసం తన పేరుకు ‘మీనన్’ అనే పదాన్ని జత చేసినట్లు చెప్పారు.
అలా ‘ఎన్.ఎస్. నిత్య’ కాస్తా ‘నిత్యా మీనన్’గా ప్రేక్షకులకు పరిచయమైందని ఆమె వివరించారు. తాను మలయాళీ కాకపోయినా, పేరు కారణంగా తనను చాలామంది మలయాళీ నటిగా భావిస్తుంటారని తెలిపారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. నిత్యా మీనన్ ప్రస్తుతం కథ, పాత్రలకు ప్రాధాన్యం ఇస్తూ ఎంపిక చేసుకుని చిత్రాలు చేస్తున్నారు. తమిళంలో ధనుష్‌తో కలిసి నటించిన ‘తిరుచిత్రంబలం’ చిత్రానికి ఆమె జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నిత్యా.. సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటూ తన ఫొటోలు, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.












