చెన్నై, సెప్టెంబర్ 04 (ప్రజా వీక్షణం ప్రతినిధి): విమానాల్లో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చిన ట్రైనర్ గ్రేడ్ మహిళా పైలట్ ఇప్పుడు వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆమె పేరే ప్రార్థనా చాబ్రియా. కోలీవుడ్‌లో తెరకెక్కిన ‘చిరో’ చిత్రంతో కథానాయికగా పరిచయం కానున్నారు.
విమానయాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రార్థనా.. ఇప్పుడు నటిగా మారడం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ఇప్పటికే ‘చిరో’ చిత్రీకరణ పూర్తికాగా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఏడాదే పండుగ కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
కేవలం అందం, గ్లామర్‌ను నమ్ముకుని సినిమాల్లోకి రావడం కాకుండా.. నటనలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న తర్వాతే ప్రార్థనా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ప్రముఖ నటనా శిక్షణ సంస్థ ‘ఆది శక్తి’లో ఆమె శిక్షణ పొందారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి తగిన విధంగా నటించి మెప్పించగలననే నమ్మకంతో ఉన్నారు.
నటనతో పాటు నృత్యంలోనూ ప్రార్థనకు మంచి ప్రావీణ్యం ఉంది. ముఖ్యంగా బెల్లీ డ్యాన్స్, పోల్ డ్యాన్స్‌లో ఆమెకు పట్టు ఉంది. దీంతో ఆధునిక పాత్రలతో పాటు సంప్రదాయ పాత్రలను కూడా సులభంగా పోషించే సామర్థ్యం ఆమెకు ఉందని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రార్థనా బహుముఖ ప్రతిభ కలిగిన యువతిగా గుర్తింపు పొందుతున్నారు. ఇంగ్లీష్, హిందీ, తమిళంతో పాటు సింధీ భాషలోనూ ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. విమానయాన రంగం నుంచి నేరుగా సినిమాల్లోకి అడుగుపెడుతున్న కొత్త నటీమణుల్లో తన ప్రయాణం భిన్నంగా ఉండాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం.
భాషాపరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకపోవడంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత దక్షిణాది ఇతర భాషల సినిమాలపై కూడా దృష్టి పెట్టే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సరైన కథ, పాత్రలు లభిస్తే తెలుగు చిత్ర పరిశ్రమలోనూ నటించేందుకు ఆమె ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యంగా ప్రార్థనా ముందుకు సాగుతున్నారు. భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ, నటనకు ప్రాధాన్యతనిస్తూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యంతో ఆమె అడుగులు వేస్తున్నారు. పైలట్‌గా ఆకాశంలో ప్రయాణించిన ప్రార్థనా.. ఇప్పుడు కథానాయికగా వెండితెరపై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటారేమో చూడాలి.












