-ఆర్చరీ, హాకీలో పతకాలు సాధించిన క్రీడాకారులకు రూ.50 వేల బహుమతి
-మరిన్ని పతకాలు సాధించాలని పాశం సునీల్ కుమార్ ఆకాంక్ష
తిరుపతిలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన అమరావతి క్రీడా పోటీల్లో గూడూరు నుంచి పాల్గొని ఆర్చరీ, హాకీ విభాగాల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ రూ.50 వేల నగదు బహుమతిని అందజేశారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమంలో క్రీడాకారులను అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో గూడూరు పేరు నిలబెట్టి పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం అందిస్తామని తెలిపారు. క్రీడల్లో ప్రతిభ కనబరుస్తూ గూడూరుకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మరిన్ని పతకాలు సాధించి గూడూరు ఖ్యాతిని ఇనుమడింపజేయాలని క్రీడాకారులకు సూచించారు. యువత చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకం అందించడం పట్ల క్రీడాకారులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.












