హైదరాబాద్, సెప్టెంబర్ 04 (ప్రజా వీక్షణం:
పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. సినిమాలు చేసింది తక్కువే అయినా.. తన నటన, అందం, నాట్య ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమె మరెవరో కాదు.. యువ నటి అనంతిక సనిల్ కుమార్.
2022లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అనంతిక ఇప్పటివరకు వివిధ భాషల్లో కలిపి కొన్ని సినిమాల్లో మాత్రమే నటించింది. అయినప్పటికీ తన క్యూట్ నటన, సహజమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’, ‘రోమాంచకం’ వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.అనంతిక కేవలం నటనకే పరిమితం కాలేదు. చిన్నతనం నుంచే నృత్యంపై ఆసక్తి పెంచుకున్న ఆమె కథాకళి, భరతనాట్యం, మోహినీయట్టం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్య కళల్లో శిక్షణ పొందింది. పలు వేదికలపై తన నృత్య ప్రదర్శనలతోనూ ఆకట్టుకుంది.
ఇక అనంతికలో మరో ప్రత్యేక ప్రతిభ మార్షల్ ఆర్ట్స్. కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడంతో పాటు కళరిపయట్టులోనూ శిక్షణ తీసుకుంది. దీంతో సినిమా వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.ముఖ్యంగా చీరకట్టులో మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు చేసిన అనంతిక వీడియోలు గతంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో ఆమెకు ఉన్న ఈ ప్రత్యేక ప్రతిభ గురించి చాలామందికి తెలిసింది. నటనతో పాటు నృత్యం, మార్షల్ ఆర్ట్స్‌లోనూ ప్రావీణ్యం ఉండటంతో అనంతికను పలువురు మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్గా అభివర్ణిస్తున్నారు.
2022లో ‘రాజమండ్రి రోజ్ మిల్క్’ సినిమాతో ఆమె వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ‘మ్యాడ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనంతరం తమిళంలో ‘రైడ్’, ‘లాల్ సలామ్’, ‘పరిమళ అండ్ కో’ వంటి చిత్రాల్లోనూ కనిపించింది.
గతేడాది విడుదలైన ‘8 వసంతాలు’ చిత్రం అనంతిక కెరీర్లో కీలకంగా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. అంతేకాకుండా ఈ చిత్రంలోని నటనకు తెలంగాణ గద్దర్ పురస్కారం కూడా అందుకోవడంతో ఆమెకు మరింత గుర్తింపు వచ్చింది.
ప్రస్తుతం అనంతిక నటించిన ‘రోమాంచకం’ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఆమెకు సంబంధించిన పాత ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో మరోసారి వైరల్‌గా మారుతున్నాయి. చిన్ననాటి ఫొటో నుంచి నేటి హీరోయిన్గా ఎదిగిన తీరు చూసి అభిమానులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అనంతిక.. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాలతో టాలీవుడ్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం కనిపిస్తోంది.












