సెప్టెంబర్ 5, (ప్రజా వీక్షణం ప్రతినిధి) భారత్‌పై ఉగ్రవాద కార్యకలాపాల విషయంలో పాకిస్థాన్ తన వ్యూహాన్ని గణనీయంగా మార్చుకుంటున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. గతంలో ఉగ్రదాడుల వెనుక పాకిస్థాన్ ప్రమేయాన్ని గుర్తించడం తేలికగా ఉండేదని, అయితే ఇప్పుడు ఆ సంబంధాలు బయటపడకుండా కొత్త పద్ధతులను అనుసరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం పాకిస్థాన్ తన ఉగ్ర నెట్‌వర్క్‌ల నిర్వహణ విధానాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించినట్లు సమాచారం. నేరుగా పాక్ ఆధారిత ఉగ్ర సంస్థల పేర్లు బయటపడకుండా మధ్యవర్తి వ్యవస్థలను ఉపయోగిస్తూ దాడులకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.ఇప్పటివరకు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర సంస్థలు ఉపయోగించిన పాత మార్గదర్శకాలు, శిక్షణా పద్ధతులు భారత దర్యాప్తు సంస్థలకు బాగా తెలిసిపోయాయి. దీంతో దాడుల వెనుక పాకిస్థాన్ పాత్రను నిరూపించడం సులభమవుతోంది. ఈ నేపథ్యంలో పాత విధానాలకు బదులుగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల పేర్లతో ప్రచారంలో ఉన్న కొత్త మార్గదర్శకాలను వినియోగిస్తున్నట్లు సమాచారం. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి సంస్థల పద్ధతులను అనుసరిస్తూ తమ ప్రమేయాన్ని మరుగునపరచే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.మరోవైపు ఉగ్రవాద నియామక ప్రక్రియలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి వంటి నగరాల నుంచి నేరుగా ఆదేశాలు వెళ్లేవి. ప్రస్తుతం సిరియా, ఇరాక్ వంటి ప్రాంతాల్లో ఉన్న హ్యాండ్లర్ల ద్వారా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లోని యువతను నేరుగా సంప్రదించడం కాకుండా సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తూ లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. వ్యక్తుల ఆన్‌లైన్ ప్రవర్తన, అభిరుచులు, మానసిక ధోరణులను విశ్లేషించి వారితో సంబంధాలు పెంచుకొని మత ఛాందసవాదం వైపు మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించారు.
ఈ కొత్త వ్యూహంలో అత్యంత ప్రమాదకర అంశం ‘లోన్ వుల్ఫ్’ దాడులకు ప్రాధాన్యం ఇవ్వడమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి దాడుల్లో పెద్ద ఉగ్ర మాడ్యూల్స్, భారీ నిధులు లేదా విస్తృత మౌలిక వసతులు అవసరం ఉండవు. ఆన్‌లైన్ ద్వారా ప్రభావితమైన వ్యక్తులు స్వతంత్రంగా దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది. దీంతో దాడి జరిగిన తర్వాత దాని వెనుక ఉన్న అసలు కుట్రదారులను గుర్తించడం దర్యాప్తు సంస్థలకు క్లిష్టంగా మారుతుంది. అంతేకాకుండా ఉగ్రవాద నెట్‌వర్క్‌ల ప్రత్యక్ష ప్రమేయం కనిపించకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో బాధ్యతను నిరూపించడం కూడా కష్టతరమవుతుంది.
పాకిస్థాన్ ఈ విధంగా వ్యూహం మార్చుకోవడానికి ‘ఆపరేషన్ సిందూర్’ ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. ఆ ఆపరేషన్ కారణంగా పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర మౌలిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోసారి అలాంటి సైనిక చర్యను ఎదుర్కొనే పరిస్థితి ప్రస్తుతం పాకిస్థాన్‌కు లేదని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ ఆర్థిక పర్యవేక్షణ సంస్థల ఒత్తిడి, ఉగ్రవాద నిధులపై పెరిగిన నిఘా, ప్రపంచ దేశాల విమర్శలు కూడా పాకిస్థాన్‌ను ప్రత్యక్ష మద్దతు నుంచి పరోక్ష వ్యూహాల వైపు నెట్టినట్లు విశ్లేషిస్తున్నారు.
భారత్ మాత్రం భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రదాడినైనా కేవలం సరిహద్దు దాటి వచ్చిన ఉగ్ర చర్యగా చూడబోమని ఇప్పటికే స్పష్టం చేసింది. అలాంటి చర్యలను దేశంపై జరిగిన యుద్ధ చర్యలుగా పరిగణిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తమ ప్రమేయం నిరూపించడానికి వీలులేకుండా చేసే ‘డినయబిలిటీ’ విధానాన్ని పాకిస్థాన్ అనుసరిస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే ఉగ్రవాద రూపం మారినా ముప్పు తగ్గలేదని, సోషల్ మీడియా ఆధారిత తీవ్రవాద ప్రచారం, ఒంటరి దాడుల వ్యూహాలను ఎదుర్కొనేందుకు భద్రతా సంస్థలు మరింత అప్రమత్తంగా పనిచేస్తున్నాయని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.












