2029 నాటికి మరో మూడు మెగా డీఎస్సీలు

16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తి చేశాం: మంత్రి లోకేశ్

వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి యూనివర్సిటీ ఫ్యాకల్టీ నియామకాలు

విజయవాడ, సెప్టెంబర్ 5 ( ప్రజా వీక్షణం ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో శనివారం నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేశారని మంత్రి తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని వెల్లడించారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.2029 నాటికి మరో మూడు మెగా డీఎస్సీలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. చంద్రబాబు నాయకత్వంలో గతంలో 14 డీఎస్సీల ద్వారా దాదాపు రెండు లక్షల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు గుర్తుచేశారు. ఉపాధ్యాయ నియామకాల విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.దశాబ్దాలుగా ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయ అధ్యాపక పోస్టుల భర్తీకి కూడా చర్యలు చేపట్టామని లోకేశ్ తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు కొత్త ఊపిరి పోసేలా ఈ నియామకాలు ఉంటాయని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన జీవో 117 కారణంగా సుమారు 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను వీడి ప్రైవేటు విద్యాసంస్థల్లో చేరారని మంత్రి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోను రద్దు చేసి, ఉపాధ్యాయ సంఘాలు, ప్రజాప్రతినిధులతో చర్చించి మోడల్ ప్రైమరీ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు.ఈ చర్యల ఫలితంగా ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని వెల్లడించారు. ఈ విజయానికి ఉపాధ్యాయుల కృషే ప్రధాన కారణమని ప్రశంసించారు.ఉపాధ్యాయుల సేవా వ్యవహారాల్లో పారదర్శకత కోసం లీప్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. బదిలీల ప్రక్రియను కూడా పారదర్శకంగా నిర్వహించామని చెప్పారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.పిల్లల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ప్రతి విద్యార్థి జీవితం విలువైనదేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తలచుకుంటే విద్యార్థుల జీవితాల్లో అద్భుతమైన మార్పులు తీసుకురాగలరని లోకేశ్ అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నాణ్యతను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్లాండ్ వంటి దేశాలకు విద్యా పర్యటనలకు పంపి అక్కడి ఉత్తమ విద్యా విధానాలను అధ్యయనం చేసే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam