సమస్యలపై పోరాటం.. ప్రజలకు అండగా నిలిచే నైజం.. అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ ప్రస్థానం

గూడూరు నియోజకవర్గం: రాజకీయాల్లో పదవులు రావడం ఒక ఎత్తయితే.. ప్రజల మనసుల్లో స్థానం సంపాదించడం మరో ఎత్తు. ప్రజా సమస్యలపై పోరాడుతూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్న నాయకుడిగా గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్‌కుమార్ గుర్తింపు పొందారని టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం.. ఎమ్మెల్యేగా గూడూరు ప్రజలకు సేవలందించే స్థాయికి చేరిందని వారు చెబుతున్నారు.
విద్యార్థి ఉద్యమాల నుంచి రాజకీయ ప్రస్థానం
పాశిం సునీల్‌కుమార్ రాజకీయ ప్రస్థానం వెనుక సుదీర్ఘ పోరాట చరిత్ర ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం తెలుగుదేశం పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. 1995 నుంచి 2000 వరకు గూడూరు మున్సిపల్ చైర్మన్‌గా పనిచేశారు. 1997లో తిరుపతి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన ఆయన రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.2001లో వెలుగు ప్రాజెక్టులో బాధ్యతలు చేపట్టి గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకున్నారని, అనంతరం ఆ బాధ్యతలకు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎన్నో ఒడిదుడుకులు.. వెనక్కి తగ్గని పోరాటం
రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదురైనా సునీల్‌కుమార్ వెనక్కి తగ్గలేదని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. 2004, 2009లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినప్పటికీ అవకాశం దక్కకపోవడంతో అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇతర పార్టీలోకి వెళ్లి 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2016లో తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేశారు.2019లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రభుత్వ విధానాలపై, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించారని టీడీపీ శ్రేణులు గుర్తుచేస్తున్నాయి. ఈ క్రమంలో కేసులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనా ప్రజా సమస్యలపై తన పోరాటాన్ని కొనసాగించారని వారు చెబుతున్నారు.

గూడూరులో టీడీపీకి పునర్వైభవం
గూడూరు నియోజకవర్గంలో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీని తిరిగి బలోపేతం చేయడంలో పాశిం సునీల్‌కుమార్ కీలక పాత్ర పోషించారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. గూడూరు టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనలు, ఆందోళనలు చేపట్టారని చెబుతున్నారు.2024 ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఆయన చేసిన కృషి కీలకమైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అనంతరం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన సునీల్‌కుమార్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకోవడంపై సునీల్‌కుమార్ దృష్టి పెట్టారని అనుచరులు చెబుతున్నారు. రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, సాగునీరు, విద్యుత్, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు.తన నివాసానికి వచ్చే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం, అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేలా ఆదేశించడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిగా కొనసాగుతున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
కరోనా సమయంలో సేవలు
కరోనా మహమ్మారి సమయంలోనూ ప్రజలకు అండగా నిలిచారని ఆయన అనుచరులు గుర్తుచేస్తున్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడంతో పాటు, పేదలు, బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా కూడా అండగా నిలిచారని తెలిపారు. కరోనా సమయంలో ప్రజల కష్టాలను దగ్గరగా తెలుసుకుని వారికి సహాయం అందించేందుకు చేసిన ప్రయత్నాలు స్థానికంగా గుర్తింపు పొందాయని పేర్కొన్నారు
అభివృద్ధి పనులకు ప్రాధాన్య0
గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల మౌలిక వసతులు, రహదారులు, విద్యా సంస్థలు, తాగునీటి వసతులు, పారిశుద్ధ్యం, ప్రజా ఆరోగ్యం తదితర అంశాలపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు.గతంలో తన పదవీకాలంలోనూ నియోజకవర్గ అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు తీసుకురావడానికి కృషి చేశారని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుని గూడూరును మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.
సీఎంఆర్ఎఫ్ ద్వారా బాధిత కుటుంబాలకు అండ
అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సాయం అందించడంలో ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అనుచరులు చెబుతున్నారు. ఇప్పటివరకు సుమారు రూ.11 కోట్ల మేర సహాయం అందేలా కృషి చేసినట్లు వారు పేర్కొంటున్నారు. వ్యక్తిగతంగా కూడా పేద విద్యార్థులకు, అనారోగ్య బాధితులకు ఆర్థిక సాయం అందిస్తూ తనవంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు.ఎవరైనా మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి వారి పరిస్థితిని బట్టి వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందించడం, దేవాలయాల అభివృద్ధికి, వివిధ సామాజిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించడం ఆయన సేవా కార్యక్రమాల్లో భాగమని అనుచరులు చెబుతున్నారు.
కార్యకర్తలకు అండగా.. నమ్మినవారికి భరోసాగా
పార్టీ కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారికి అండగా నిలవడం పాశిం సునీల్‌కుమార్ ప్రత్యేకతగా టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. తనతో కలిసి నడిచిన నాయకులు, కార్యకర్తలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంతో పాటు అవసరమైన సమయంలో ఆర్థికంగా కూడా అండగా నిలిచారని చెబుతున్నారు.
పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ తనవంతు సహకారం అందిస్తూ కార్యకర్తలపై ఆర్థిక భారం పడకుండా చూసుకుంటారని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఎక్కడికి వెళ్లినా కార్యకర్తలను, ప్రజలను పేరుపేరునా పలకరించడం ఆయనకు ప్రజలతో ఉన్న అనుబంధానికి నిదర్శనమని అభిమానులు అంటున్నారు.
ప్రత్యర్థులకు సవాల్‌గా.. తనదైన రాజకీయ శైలిలో
పాశిం సునీల్‌కుమార్ తన పదునైన రాజకీయ ప్రసంగాలతో ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యలపై పోరాటాల్లో ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఆయన రాజకీయ శైలి గూడూరు నియోజకవర్గంలో ప్రత్యేక చర్చకు కారణమవుతోందని పేర్కొంటున్నారు.
“మన గూడూరు.. మన సునీల్”
ప్రజా సమస్యలపై స్పందించడం, ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం, కార్యకర్తలకు భరోసా ఇవ్వడం, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం వంటి అంశాలతో సునీల్‌కుమార్ ప్రజలకు మరింత చేరువయ్యారని ఆయన అభిమానులు చెబుతున్నారు.
“ఆపదలో ఉన్న వారికి ఆపద్బాంధవుడు..
నమ్మిన వారికి అండగా నిలిచే నాయకుడు.. ప్రజా సమస్యలపై పోరాడే ప్రజా ప్రతినిధి.. అభివృద్ధి కోసం పనిచేసే నాయకుడు” అనే గుర్తింపు ఆయనకు ప్రజల్లో ఏర్పడిందని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్లడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్ చెబుతున్నారు. “మన గూడూరు–మన సునీల్” అనే నినాదంతో ప్రజలతో తన అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగుతోంది.












