చిన్న తగాదాలతో కోర్టుల చుట్టూ తిరగొద్దు

లోక్‌ అదాలత్‌ ద్వారా కేసుల పరిష్కారం..
ఇరువర్గాలకూ విజయం

జాతీయ లోక్‌ అదాలత్‌లో జూనియర్‌ సివిల్‌ జడ్జి మధుబాబు

గూడూరు: చిన్న చిన్న తగాదాలకు సంబంధించి కేసులు పెట్టుకుని కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగడం వల్ల సమయం, డబ్బు వృథా అవుతుందని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి మధుబాబు అన్నారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల ఇరువర్గాలకూ మేలు జరుగుతుందని పేర్కొన్నారు.
గూడూరు పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మధుబాబు మాట్లాడుతూ.. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు లోక్‌ అదాలత్‌లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
చిన్నపాటి వివాదాలు, కుటుంబ సమస్యలు, ఇతర తగాదాల కారణంగా కేసులు నమోదు చేసుకుని సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడం వల్ల కక్షిదారులకు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. అలాంటి కేసులను ఇరువర్గాల అంగీకారంతో రాజీ మార్గంలో పరిష్కరించుకోవడం ఉత్తమమని సూచించారు.
రాజీ మార్గమే ఉత్తమ మార్గమని, లోక్‌ అదాలత్‌ ద్వారా కేసును పరిష్కరించుకున్నప్పుడు ఒక వర్గం గెలిచి మరో వర్గం ఓడిపోయినట్లు కాకుండా ఇరువర్గాలూ విజయం సాధించినట్లేనని జడ్జి మధుబాబు పేర్కొన్నారు.
కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పర అంగీకారంతో తమ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు.
అనంతరం ఏడవ అదనపు జిల్లా జడ్జి కె. వెంకట నాగ పవన్ కక్షిదారులతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరేలా చర్యలు తీసుకుని పలు కేసులను పరిష్కరించారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాదులు సాయికుమార్ రెడ్డి, కోటేశ్వరరావు, అరవ పార్వతయ్య, మహబూబ్ భాష, భాస్కర్ రెడ్డి, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.

ప్రజా వీక్షణం  12/09/2026

error: Content is protected !!
Prajaveek Shanam