నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు
నాయుడుపేట: నాయుడుపేట డివిజన్ పరిధిలో వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలు, సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వాహకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.శనివారం నాయుడుపేట డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకునేందుకు పోలీసుశాఖ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.
వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు ముందుగా ఆన్లైన్ లేదా ప్రత్యక్ష విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ సిబ్బంది పరిశీలన అనంతరం నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు.వినాయక మండపాల ఏర్పాటు, ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇతర మతస్తుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
మండపాల వద్ద కాపలా తప్పనిసరి
వినాయక మండపాల వద్ద ప్రతిరోజూ రాత్రి సమయంలో కనీసం ఒకరు లేదా ఇద్దరు నిర్వాహకులు కాపలాగా ఉండాలని డీఎస్పీ సూచించారు. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు.
లౌడ్ స్పీకర్లను రాత్రి 10 గంటలలోపు నిలిపివేయాలని స్పష్టం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలనుకునే నిర్వాహకులు ముందుగా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు.
విగ్రహాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, మహిళలను వేధించడం వంటి చట్టవ్యతిరేక చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ తావివ్వకూడదని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఉపయోగించే మార్గాలు, వాహనాల వివరాలను ముందుగానే పోలీసులకు తెలియజేయాలని డీఎస్పీ తెలిపారు. నిమజ్జన మార్గాల్లో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో నిమజ్జన కార్యక్రమాలకు వెళ్లే వారు సాయంత్రం 5 గంటలలోపు నిమజ్జన ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. సాయంత్రం 5 గంటల అనంతరం మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మాత్రమే నిమజ్జనానికి అనుమతి ఉంటుందని తెలిపారు.రాత్రి సమయంలో సముద్రంలోకి వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేయడం పూర్తిగా నిషేధమని డీఎస్పీ స్పష్టం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిబంధనను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు.
డీజేలకు అనుమతి లేదు
వినాయక మండపాల వద్ద కానీ, నిమజ్జన కార్యక్రమాల సమయంలో కానీ డీజేలను వినియోగించేందుకు ఎలాంటి అనుమతి లేదని డీఎస్పీ చెంచుబాబు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వినియోగిస్తే నిర్వాహకులతో పాటు డీజే నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే డివిజన్ పరిధిలో సుమారు 80 మంది డీజే నిర్వాహకులను తహశీల్దార్ సమక్షంలో బైండోవర్ చేసినట్లు వెల్లడించారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు
వినాయక విగ్రహాలను తరలించే వాహనాల డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకూడదని డీఎస్పీ హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపినట్లు గుర్తిస్తే మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులు నమోదు చేస్తామని తెలిపారు.నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించాలని కోరారు. వాహనాలపై పరిమితికి మించి ప్రజలను ఎక్కించుకోవడం, నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
రాజకీయాలకు తావులేకుండా పండుగ జరుపుకోవాలి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఎలాంటి రాజకీయ కక్షలు, కార్పణ్యాలకు తావివ్వకుండా అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని డీఎస్పీ కోరారు. వినాయక చవితి పండుగను రాజకీయాలకు అతీతంగా గ్రామం మొత్తం ఒక్కటై ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.గ్రామాల్లో కచేరీలు, పరుగు కార్యక్రమాలు తదితరాలకు అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. పండుగ పేరుతో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజల భక్తి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని, సోదరభావంతో వినాయక చవితి వేడుకలను విజయవంతంగా నిర్వహించుకోవాలని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు కోరారు.












