గూడూరు: భారత కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రముఖ సిద్ధాంతవేత్తగా, కమ్యూనిస్టు దిగ్గజంగా గుర్తింపు పొందిన భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండో వర్ధంతి కార్యక్రమాన్ని గూడూరులో నిర్వహించారు.గూడూరులోని సీపీఎం పార్టీ కార్యాలయంలో శనివారం శాఖ కార్యదర్శి జోగి శివకుమార్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజలతో కలిసి జీవితాంతం పోరాటం చేసిన సీతారాం ఏచూరి కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులతో వ్యక్తిగత సంబంధాలను కొనసాగిస్తూనే రాజకీయ విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ఆయన ఎప్పుడూ ప్రయత్నించేవారని తెలిపారు.
సీతారాం ఏచూరి కేవలం రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా మార్క్సిజం, సామాజికవాదం, మతతత్వం, భారత రాజకీయాలపై విస్తృతంగా రచనలు చేసిన ప్రముఖ సిద్ధాంతవేత్తగా కూడా గుర్తింపు పొందారని అన్నారు. దేశ రాజకీయ పరిణామాలను లోతుగా విశ్లేషిస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం తన గళాన్ని వినిపించారని గుర్తుచేశారు.
సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో జన్మించారని, విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాల పట్ల ఆకర్షితులయ్యారని నాయకులు తెలిపారు. కమ్యూనిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి పార్టీ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహించారని పేర్కొన్నారు.
2024 ఆగస్టులో అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సీతారాం ఏచూరి శ్వాసకోశ సంబంధిత తీవ్రమైన అనారోగ్యంతో చికిత్స పొందుతూ 2024 సెప్టెంబర్ 12న కన్నుమూశారని తెలిపారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలని పేర్కొన్నారు.సీతారాం ఏచూరి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు ఆయన భౌతికకాయాన్ని వైద్య విద్య, పరిశోధనల కోసం ఎయిమ్స్‌కు దానం చేయడం ఆయన ప్రజాసేవా భావానికి, సామాజిక బాధ్యతకు నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు టి. వెంకటరామిరెడ్డి, పుట్టా శంకరయ్య, పామంజి మణి, బి.వి. రమణయ్య, అడపాల ప్రసాద్, ఎంబేటి చంద్రయ్య, ఎస్.డి. రఫీ, గండికోట మధు, ధారా కోటేశ్వరరావు, బి. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.












