గూడూరు కాంగ్రెస్‌కు కొత్త సారథి

ఇన్‌చార్జిగా నరసయ్య నియామకం.. పార్టీ బలోపేతమే లక్ష్యం

గూడూరు, ప్రజా వీక్షణం:
గూడూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ఆ పార్టీ జిల్లా నాయకత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భీమవరపు నరసయ్యను గూడూరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జిగా నియమించారు.
ఈ సందర్భంగా గూడూరులో జరిగిన కార్యక్రమంలో నరసయ్యకు పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. ఆయనను సన్మానించి కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బాలగురువం బాబు మాట్లాడుతూ.. పార్టీకి గ్రామస్థాయిలో బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రధానంగా తీసుకుని వారి సమస్యలపై పార్టీ తరఫున స్పందించాలని నాయకులకు పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
నూతన ఇన్‌చార్జి నరసయ్య మాట్లాడుతూ.. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకువచ్చి కాంగ్రెస్‌ కార్యకలాపాలను విస్తృతం చేస్తామని చెప్పారు.గ్రామాల్లో పర్యటించి స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తామని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పార్టీ తరఫున నిరంతరం కృషి చేస్తామని నరసయ్య పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి గూడూరు నియోజకవర్గంలో బలమైన పునాది ఏర్పడేలా అందరి సహకారంతో ముందుకు సాగుతానన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, పట్టణ స్థాయి కాంగ్రెస్‌ నాయకులు, యువజన, మైనారిటీ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ వెంకట నరసింహులు, జిల్లా జనరల్‌ సెక్రటరీ రమేష్‌, జిల్లా అధికార ప్రతినిధి పర్వతాల శ్రీనివాస్‌ గౌడ్‌, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు ఫయాజ్‌, జిల్లా సెక్రటరీ గోపి, జిల్లా ఉపాధ్యక్షుడు దేవదానం, గూడూరు పట్టణ అధ్యక్షుడు గౌస్‌, పట్టణ జనరల్‌ సెక్రటరీ ఇబ్రహీం, టౌన్‌ మైనారిటీ అధ్యక్షుడు ఖలీల్‌, టౌన్‌ యూత్‌ అధ్యక్షుడు ఎండీ ఖాజీర్‌ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam