ప్రజలకు సంక్షేమ ఫలాలు నూటికి నూరు శాతం అందాలి: కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు, సెప్టెంబర్ 15, ప్రజా వీక్షణం:
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో నెల్లూరు జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఎనిమిదో కలెక్టర్ల సదస్సులో జిల్లాకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ అంశాలపై చర్చించిన విషయాలతో పాటు శాంతిభద్రతలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో సమీక్షించారు.తొలుత జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం వివిధ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలు, ఇప్పటివరకు సాధించిన ప్రగతిపై అధికారులు వివరాలు సమర్పించారు.వ్యవసాయ అనుబంధ రంగాలు, సేవారంగం, పరిశ్రమలు, గృహ నిర్మాణం, నీటిపారుదల, పురపాలక శాఖలు, రహదారులు, విద్య, సంక్షేమం తదితర రంగాల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విద్యుత్ శాఖ అధికారులకు అభినందనలు
జిల్లాలో మెరుగైన పనితీరు కనబరిచిన విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం కింద 25 వేలకు పైగా విద్యుత్ కనెక్షన్లు అందించి జిల్లాను రాష్ట్రంలో ఉన్నత స్థానంలో నిలిపినందుకు అధికారులను ప్రశంసించారు.
రామాయపట్నం ఓడరేవు అభివృద్ధి, బీపీసీఎల్ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణలో కీలకంగా పనిచేసిన రెవెన్యూ అధికారులను కూడా అభినందించారు. త్వరలో ప్రధానమంత్రి చేతుల మీదుగా బీపీసీఎల్ పరిశ్రమకు భూమిపూజ జరగనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆదేశించారు.ప్రతి ప్రభుత్వ శాఖ తమ పరిధిలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో చేరేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. శాఖల పనితీరును మరింత మెరుగుపరచి నెల్లూరు జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెండ్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్ఓ విజయ్ కుమార్తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.












