మాదిగలకు పెన్షన్ల దరఖాస్తు గడువు పెంచాలి

ఈ నెల 25 వరకు అవకాశం కల్పించాలని ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు మందా రవి మాదిగ విజ్ఞప్తి

గూడూరు, సెప్టెంబర్ 16:
ఎస్సీ మాదిగలు, చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రభుత్వం మంజూరు చేస్తున్న పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించాలని ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర నాయకుడు మందా రవి మాదిగ ప్రభుత్వాన్ని కోరారు. ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ సూచనలు, ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మాదిగలకు అందుతున్న సంక్షేమ పథకాలు, పెన్షన్లపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రస్తుతం ప్రభుత్వం ఎస్సీ మాదిగలు, చర్మకారులకు 41 సంవత్సరాల వయసు నిండిన వారికి, డప్పు కళాకారులకు 51 సంవత్సరాల వయసు నిండిన వారికి పెన్షన్లు మంజూరు చేసే ప్రక్రియ చేపట్టిందని మందా రవి మాదిగ తెలిపారు. ఈ నేపథ్యంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఎంఆర్‌పీఎస్ నాయకులు, కార్యకర్తలు పర్యటిస్తూ అర్హులైన మాదిగలను గుర్తించి వారికి పెన్షన్లపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.అర్హత ఉన్నవారికి అవసరమైన పత్రాలను సిద్ధం చేయించి, పెన్షన్ కోసం దరఖాస్తులు రాయించడంతో పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధంగా సహకరిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ప్రభుత్వం ప్రకటించిన పెన్షన్లపై పూర్తి స్థాయిలో సమాచారం లేకపోవడంతో పాటు, అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడంలో ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ నెల 18వ తేదీని దరఖాస్తులకు చివరి గడువుగా ప్రకటించడంతో అర్హత ఉన్నప్పటికీ కొంతమంది దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని మందా రవి మాదిగ అన్నారు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉన్న అర్హులైన మాదిగలకు మరింత సమయం అవసరమని తెలిపారు.అర్హత ఉన్న ఏ ఒక్కరూ అవకాశం కోల్పోకుండా ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి పెన్షన్ దరఖాస్తుల గడువును ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గడువు పెంచితే గూడూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరింత మంది అర్హులు పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని మందా రవి మాదిగ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మారి ,భాస్కర్ ,మాదిగ ఎంఆర్‌పీఎస్ తతిధరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam