భారీ ర్యాలీ.. అర్ధనగ్న ప్రదర్శన.. రాస్తారోకో
భారీ ర్యాలీ.. అర్ధనగ్న ప్రదర్శన.. రాస్తారోకో
గురుకులం పునఃప్రారంభించే వరకు పోరాటం కొనసాగిస్తాం: సాధన సమితి

గూడూరు, సెప్టెంబర్ 17: ప్రజా వీక్షణం
కోటలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తూ కోట గురుకులం సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన గూడూరు నియోజకవర్గ బంద్ విజయవంతమైంది. బంద్‌కు సీపీఐ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఐ(ఎంఎల్), ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, యూఎస్‌ఎఫ్, ఏఎస్‌ఎఫ్ తదితర పార్టీలు, విద్యార్థి సంఘాలు మద్దతు ప్రకటించాయి.బంద్‌లో భాగంగా గూడూరు పట్టణంలో వందలాది మంది ఆందోళనకారులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్‌లో అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. అదే ప్రాంతంలో రాస్తారోకో నిర్వహించడంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతరం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
గురుకులం సాధించే వరకు ఉద్యమం
కోట గురుకులాన్ని పునఃప్రారంభించే వరకు తమ పోరాటం ఆగదని సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. దళిత విద్యార్థుల విద్యా హక్కు, భవిష్యత్తుకు భంగం కలిగించే నిర్ణయాలను సహించబోమని తెలిపారు. “దళిత బిడ్డలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు.. కోట గురుకులాన్ని సాధించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం” అని స్పష్టం చేశారు. డీసీఓ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, దుకాణాల మూసివేత
బంద్‌కు స్పందిస్తూ పలు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, దుకాణాలను కూడా ఆందోళనకారులు మూసివేయించారు. వంద మందికి పైగా నాయకులు, కార్యకర్తలు పాల్గొని బంద్‌ను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు జీ. శశికుమార్, షేక్ జమాలుల్లా, సునీల్ యాదాల, భీమవరపు నరసయ్య, బండ్ల హరి, ఫయాజ్, షేక్ గౌస్, ఎండీ. ఇబ్రహీం, అనిల్ కుమార్, ఎల్వీ సుబ్బయ్య, వెంకటేశ్వర్లు రాజు, డీపీ. పోలయ్య, ఎం. సునీల్, సురేష్ రెడ్డి, మణి, షఫీ హరన్, నరేంద్ర, షారుఖ్, రిజ్వాన్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.












