మైనారిటీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్
గూడూరు: పట్టణంలోని ఎన్ఆర్ పేటలో పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి ఎండీ అబ్దుల్ రహీమ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి అబ్దుల్ రహీమ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అబ్దుల్ రహీమ్ మైనారిటీ నాయకుడిగా పట్టణంలోని మైనారిటీ వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి కూటమి ప్రభుత్వం విజయానికి కృషి చేశారని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మైనారిటీ వర్గాలు పెద్ద సంఖ్యలో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మైనారిటీలు నమాజ్ చేసుకునేందుకు స్థలం కావాలని కోరడంతో వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని గాంధీనగర్‌లో స్థలం కేటాయించినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో అన్ని వర్గాల ప్రజల కృషి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలోనే ప్రజలు కూటమికి మద్దతుగా నిలిచారని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.












