పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్
గూడూరు: పట్టణంలోని సొసైటీ సెంటర్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మునిసిపల్ పారిశుధ్య కార్మికులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పరిశుభ్రత, పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ప్రతి నెల మూడో శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రజలు తమ ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఇళ్లలో ఉత్పత్తయ్యే చెత్తను రోడ్లపై, ఖాళీ ప్రదేశాల్లో వేయకుండా మునిసిపల్ సిబ్బంది చెత్త సేకరణ కోసం వచ్చినప్పుడు వారికి అందజేయాలని సూచించారు.రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం వల్ల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలతో పాటు రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. పారిశుధ్య నిర్వహణలో మునిసిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.
పరిశుభ్రమైన గూడూరు కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు.












