ఐదో రోజు బ్రహ్మోత్సవాల్లో వైభవంగా మోహినీ అవతార సేవ
తిరుమల, సెప్టెంబర్ 19: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తిభావంతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు ఉదయం శ్రీ మలయప్పస్వామివారు మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడిగా భక్తులకు దర్శనమిచ్చారు.
సర్వాలంకార భూషితుడైన స్వామివారి మోహినీ రూపాన్ని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి పల్లకీసేవ సందర్భంగా గజరాజులు ముందుగా నడవగా.. భక్తుల భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాలు, జీయ్యంగార్ల ఘోషల మధ్య సేవ వైభవంగా సాగింది. మార్గమధ్యంలో భక్తులు కర్పూరహారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.
అదే సమయంలో మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై భక్తులకు దర్శనమిచ్చారు.
మోహినీ రూపం వెనుక ఆధ్యాత్మిక సందేశం
మోహినీ అవతారం భగవంతుని దివ్యలీలలకు ప్రతీకగా భావిస్తారు. మాయామోహాలకు లోనుకాకుండా భగవంతుని శరణు పొందాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ అవతార దర్శనం అందిస్తుంది. భక్తి మార్గం ద్వారా మాయామోహాలను అధిగమించవచ్చనే భావనను మోహినీ అలంకారం చాటిచెబుతుంది.
గరుడ వాహనసేవకు ప్రత్యేక ప్రాధాన్యం
బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనసేవకు అత్యంత విశిష్టత ఉంది. భగవంతుని వాహనమైన గరుడుని దర్శించడం ద్వారా భక్తులకు శరణాగతి, జ్ఞానం, వైరాగ్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఈ బ్రహ్మోత్సవ సేవల్లో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణ, ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీధర్ వర్మ తదితరులు పాల్గొన్నారు.












