ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విషాదం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరి మృతి

నెల్లూరు జిల్లా, సెప్టెంబర్ 20: అర్ధరాత్రి వేళ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చోటుచేసుకున్న ఘటన నెల్లూరు జిల్లా గూడూరు మండలంలో కలకలం రేపింది. రామలింగాపురం గ్రామ పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన విద్యుత్ పరికరాల వద్ద ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు స్కూటీపై అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో వారు అనుమానాస్పదంగా సంచరించిన అనంతరం విద్యుత్ షాక్‌కు గురైనట్లు సమాచారం. ఘటన అనంతరం మృతదేహాలను సమీపంలోని చెట్ల వద్ద ఉంచినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఘటనా స్థలంలో పోలీసులు స్కూటీని గుర్తించారు. దాని రిజిస్ట్రేషన్ నంబర్‌ను పరిశీలించగా.. ఓజిలి మండలం సగుటూరు గ్రామానికి చెందిన ఓ మహిళ పేరుతో వాహనం నమోదై ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల గుర్తింపు, వారు ఏ ప్రాంతానికి చెందినవారు, ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు ఎందుకు వచ్చారు, నిజంగానే చోరీకి ప్రయత్నించారా అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్ షాక్‌కు గురైన పరిస్థితులు, ఘటనకు దారితీసిన కారణాలు, మృతుల పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam