దోమల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అనుమానాస్పద డెంగ్యూ కేసు ఇంటి వద్ద లార్వా, జ్వర సర్వే
పలమనేరు, సెప్టెంబర్ 20: వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పలమనేరు సబ్యూనిట్ ఆఫీసర్ కె.సి. జయశంకర్ సూచించారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు.
పలమనేరు పట్టణంలోని బసవన్న కట్ట స్ట్రీట్లో అనుమానాస్పద డెంగ్యూ పాజిటివ్ కేసుగా గుర్తించిన ఇంటిని సబ్యూనిట్ ఆఫీసర్ కె.సి. జయశంకర్ సందర్శించారు. పరిసర ప్రాంతాల్లో లార్వా సర్వేతో పాటు జ్వర సర్వేను నిర్వహించారు. ఇంటి పరిసరాల్లో దోమల వృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించారు.
వర్షాకాలంలో ఇళ్ల చుట్టూ నీరు నిల్వ ఉండకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పనికిరాని డబ్బాలు, పాత టైర్లు, పగిలిన కుండలు, పూల కుండీలు తదితరాల్లో నీరు నిల్వ ఉంటే వాటిని వెంటనే ఖాళీ చేయాలని తెలిపారు. అదేవిధంగా ఫ్రిజ్ వెనుక భాగంలో నీరు నిల్వ ఉండే ప్రాంతాలను కూడా తరచూ పరిశీలించి శుభ్రం చేసుకోవాలని సూచించారు.
ఇళ్ల పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల వృద్ధిని నియంత్రించవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా వర్షం పడిన తర్వాత ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
దోమలు ఇళ్లలోకి ప్రవేశించకుండా కిటికీలకు మెస్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సాయంత్రం వేళల్లో తలుపులు మూసి ఉంచడం ద్వారా దోమల ప్రవేశాన్ని కొంతవరకు అడ్డుకోవచ్చని తెలిపారు. రాత్రి సమయంలో దోమతెరలను వినియోగించాలని సూచించారు.
అలాగే బయటకు వెళ్లే సమయంలో చేతులు, కాళ్లు పూర్తిగా కప్పి ఉంచే విధంగా దుస్తులు ధరించడం ద్వారా దోమకాటు నుంచి రక్షణ పొందవచ్చని కె.సి. జయశంకర్ ప్రజలకు వివరించారు. జ్వరం, ఇతర అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పార్వతి, యరపరెడ్డి, ఆశా కార్యకర్త షాహిన్ తదితరులు పాల్గొన్నారు.












