గూడూరు, సెప్టెంబర్ 24: నెల్లూరు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గూడూరులోని సీపీఎం కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరువు పరిశీలనా బృందం పొదలకూరు, రాపూరు, సైదాపురం మండలాల్లో పర్యటించి పంట పొలాలను పరిశీలించినట్లు తెలిపారు.బొప్పాయి తోటలు వైరస్ కారణంగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, నిమ్మకాయలకు ధరలు పడిపోయాయని చెప్పారు. కండలేరు జలాశయంలో తగినంత నీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఒకవైపు కరువు పరిస్థితులు, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
రైతులకు రుణమాఫీ చేయాలని, కౌలు రైతులకు నష్టపరిహారం అందించాలని, దెబ్బతిన్న అన్ని పంటలకు బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించాలని మూలం రమేష్ డిమాండ్ చేశారు. జిల్లాలో తక్షణ సహాయక చర్యల కోసం రూ.20 కోట్లు కేటాయించాలని కోరారు.ఎల్నినో ప్రభావంతో పంటలు దెబ్బతిన్నాయని, కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.సీపీఎం నేతలు మాదాల వెంకటేశ్వర్లు, ఎం. మోహన్రావు మాట్లాడుతూ సైదాపురం ప్రాంతంలో బావులు, చెరువులు ఎండిపోయిన పరిస్థితిని పరిశీలించినట్లు తెలిపారు. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులకు బీమా పరిహారం అందించాలని, పంట రుణాలను రద్దు చేయాలని, కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఎం. పుల్లయ్య, మన్నూరు భాస్కరయ్య, అల్లాడి గోపాల్, ఎస్కే. రషీద్, జోగి శివకుమార్, పి. శ్రీనివాసులు, బి.వి. రమణయ్య, బి. నారాయణ, బి. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.












